ముంబై: టెక్కీ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె భర్త, మహిళా టీచర్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన 29 ఏళ్ల ప్రియాంక రావత్ ఈ నెల 15న రాత్రి 10 గంటల వేళ పన్వెల్ రైల్వే స్టేషన్ వెలుపల హత్యకు గురైంది. కేసు దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు హతురాలి భర్త 32 ఏళ్ల దేవవ్రత్సింగ్ రావత్, అతడి ప్రియురాలు, టీచర్‌గా పని చేస్తున్న 24 ఏళ్ల నికితా మట్కర్, నికిత పనిచేసే ట్యుటోరియల్ నడుపుతున్న 45 ఏళ్ల ప్రవీణ్ ఘడ్గే, ముగ్గురు కిరాయి హంతకులు పంకజ్ నరేంద్ర కుమార్ యాదవ్ (26), దీపక్ దినకర్ చోఖండే (25), రావత్ రాజు సోనోన్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు గురించి పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన ప్రియాంక, బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన దేవవ్రత్సింగ్ రావత్ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కలిశారు. నాలుగేళ్ల కిందట వారి పెళ్లి జరిగింది. 2020లో రావత్‌కు చెందిన ఈ కామర్స్ ఆఫీస్‌లో నికితా మట్కర్ కొంత కాలం పని చేసింది. అక్కడ పని మానేసిన కొంత కాలానికి వారి మధ్య ఉన్న పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఈ ఏడాది ఆగస్ట్‌లో వారిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
కాగా, రావత్ భార్య ప్రియాంకకు ఈ విషయం తెలిసింది. తల్లిదండ్రులు, అత్తమామలకు దీని గురించి ఆమె చెప్పలేదు. అయితే తన భర్త నుంచి దూరంగా ఉండాలని నికితను ఆమె హెచ్చరించింది. దీంతో రావత్‌తో కలిసి జీవించాలని భావించిన నికిత చివరకు ప్రియాంకను చంపాలని ప్లాన్ వేసింది. కిరాయి హంతకుల కోసం గూగుల్‌లో వెతికింది. ఫలితం లేకపోవడంతో ఫేస్బుక్లో వెతికి ఒక కిరాయి హంతక ముఠాను ఫోన్లో సంప్రదించింది. అనంతరం ట్యుటోరియల్ నిర్వాహకుడు ప్రవీణ్ ఘడ్గే వారితో బేరసారాలు జరిపి రూ.3 లక్షలకు ఒప్పందం కుదిర్చాడు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు. ప్రియాంక హత్య సమయంలో ముగ్గురు కిరాయి హంతకుల వెంట అతడు ఉన్నాడు.
గత గురువారం పన్వెల్ రైల్వే స్టేషన్ వెలుపల ప్రియాంక హత్య తర్వాత ఆమె భర్త దేవవ్రత్సింగ్ రావత్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. నికితతో కలిసి దిగిన ఫోటోలపై ఆరా తీయగా వారిద్దరూ రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో నికితపై దర్యాప్తు చేపట్టారు. ఆమె కంప్యూటర్ను పరిశీలించగా కిరాయి హంతకుల కోసం గూగుల్‌లో వెతికినట్లు బయటపడింది. ఈ హత్య కేసులో దొరకబోనన్న ధీమాతో ఉన్న నికిత గూగుల్ సెర్చ్ హిస్టరీని కూడా క్లియర్ చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రియాంక హత్య జరిగిన విధానాన్ని ఆమె బయటపెట్టిందని వెల్లడించారు.