జైపూర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయాడు. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో వెలుగు చూసింది.
ఓ 11 ఏండ్ల బాలిక స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లి ఆందోళనకు గురై పాఠశాల వద్దకు వెళ్లింది. అక్కడున్న ఓ గదిలో బాలిక అరుపులు విన్న తల్లి తల్లడిల్లిపోయింది. గది తలుపులు తెరవాలని తల్లి గట్టిగా అరవడంతో.. టీచర్ ఆమెను తోసేసి అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. దీంతో తల్లీకూతురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.