స్పైరల్ పాస్తా: రెండు కప్పులు
బచ్చలి కూర తరుగు: ఒకటిన్నర కప్పు
ఉల్లిగడ్డలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: అయిదారు
బటర్: చిన్న ప్యాకెట్, గోధుమ పిండి: టేబుల్ స్పూను
పాలు: ఒకటిన్నర కప్పు
బీన్స్, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు: అరకప్పు
మిరియాల పొడి: పావు స్పూను
నూనె: టేబుల్ స్పూను, చీజ్: అరకప్పు
చిల్లీ ఫ్లేక్స్: పావు స్పూను, ఉప్పు: తగినంత
రెండు కప్పుల పాస్తాను మూడు కప్పుల నీళ్లలో ఉడికించాలి. అందులోనే టీ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఉడికిన తర్వాత నీళ్లు ఒంపేసి పక్కకు పెట్టాలి. ఉల్లిగడ్డను తరిగి, వెల్లుల్లి రెబ్బలు చెక్కుతీసి పెట్టుకోవాలి. బచ్చలకూరను కూడా కడిగి, సన్నగా తరుక్కోవాలి. క్యాప్సికం, క్యారెట్, బీన్స్‌లను ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి తీయాలి. ఇప్పుడు బాణట్లో బటర్ వేసి గోధుమ పిండిని వేయించాలి. పిండి రంగు మారకుండా చూసుకోవాలి. ఈ పిండితో పాటు ఉల్లి గడ్డలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణట్లో కొంచెం నూనె వేసి వెల్లుల్లి పాయల్ని పచ్చిదనం పోయేంతవరకూ వేయించుకోవాలి.
ఇందులోనే తరిగిన బచ్చలికూరను కూడా వేసి వేయించాలి. ఇందాక మిక్సీ పటుకున్న మిశ్రమాన్ని బాణట్లో వేయాలి. తర్వాత పాలు పోసి బాగా కలపాలి. ఇప్పుడిది పాస్తా సాస్‌లాగా తయారవుతుంది. ఇందులో దాదాపు ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, మిరియాల పొడి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పాస్తాను వేసి కలపాలి. దానితో పాటుగా ఇందాక ఉడికించుకున్న క్యారెట్, క్యాప్సికం, బీన్స్ ముక్కల్నీ కలపాలి. తర్వాత చీజ్‌ను బాగా తురిమి పాస్తా మీద వేసి ఒక్క ఉడుకు రానిచ్చి దింపాలి. చివర్లో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తే కారంకారంగా తినడానికి రుచిగా ఉంటుంది.