బోన్‌లెస్ చికెన్ ముక్కలు: ఒక కప్పు, మైదా: ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: పది, పచ్చిమిర్చి: రెండు, కారం: అర టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, సోయా సాస్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: ఒక టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్: ఒక టీస్పూన్, ఉల్లికాడల తురుము: ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము: ఒక టీస్పూన్, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు.
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గంటపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక, చికెన్ ముక్కలువేసి పది నిమిషాలపాటు సన్నటి మంటమీద రెండు వైపులా తిప్పుతూ వేయించి పక్కనపెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వెన్న వేడయ్యాక సన్నగా తురిమిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. బాగా వేగాక ఉల్లికాడలు, కారం, సోయా సాస్ వేయాలి. పావుకప్పు నీళ్లలో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి సాస్ మిశ్రమంలో పోసి కలుపుతూ అయిదు నిమిషాలపాటు సన్నటి మంటపై దగ్గరపడనివ్వాలి. వేయించిన చికెన్ ముక్కల్ని వేసి మరో రెండు నిమిషాలు మగ్గాక, కొత్తిమీర తురుము జోడిస్తే వేడివేడి బటర్ గార్లిక్ చికెన్ సిద్ధం.