MAD Review | సినిమా : మ్యాడ్
తారాగణం: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్, గౌరీప్రియ, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్వాన్..
దర్శకత్వం: కల్యాణ్‌శంకర్
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్ అంటే జనరేషన్‌తో సంబంధంలేని జానర్. ఏ ట్రెండ్‌లో అయినా ఇలాంటి సినిమాలు ఆడేస్తాయి. సరైన కథానేపథ్యాన్ని ఎంచుకొని సినిమా తీస్తే విజయం పక్కా. అందుకు గతంలో వచ్చిన కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ వరుసలోనే వచ్చిన మరో యువతరం చిత్రం ‘మ్యాడ్’. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ (Narne nithin)హీరోగా పరిచయం అయ్యాడు. అతనితోపాటు సంగీత్ శోభన్, రామ్‌నితిన్, గౌరిప్రియ, అనంతిక, గోపిక తదితర యువతారలు ఇందులో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. నిర్మాణంలో ఉన్నప్పుడే మంచి బజ్‌ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలావుంది? ఈ యువతరం అల్లరి తెరపై మెప్పించిందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి..
మనోజ్(రామ్‌నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్శోభన్).. ముగ్గురూ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు. బాస్కెట్‌బాల్ పోటీలు ఈ ముగ్గురునీ ఒకటి చేశాయి. ముగ్గురూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇదిలావుంటే.. శృతి (గౌరిప్రియ)అనే అమ్మాయిని మనోజ్ ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అనే అమ్మాయి అశోక్‌ని ప్రేమిస్తుంటుంది. వీరిప్రేమ వ్యవహారాలు ఇలావుంటే, మూడోవాడైన దామోదర్‌కి వెన్నెల అనే అమ్మాయి నుంచి ప్రేమలేఖ వస్తుంది. దాంతో వెన్నెల ప్రేమలో పడిపోయాడు దామోదర్. నాలుగేళ్లు ఆ అమ్మాయిని చూడకుండానే ప్రేమిస్తున్నాడు. హాస్టల్‌కి ఫోన్‌చేసి రోజూ దామోదర్‌తో వెన్నెల మాట్లాడుతుంది కానీ కనపడదు. ఇక వెన్నెల కోసం వెతికే క్రమంలో దామోదర్‌కి ఓ నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? ఈ ప్రశ్నకు సమాధానమే మిగిలిన కథ.
కథా విశ్లేషణ..
ఈ కథలో ప్రధాన పాత్రలు మనోజ్, అశోక్, దామోదర్. ఈ ముగ్గురు పేర్లలో మొదటి అక్షరం తీసుకుని ‘MAD’ అని టైటిల్ పెట్టాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కళాశాల నేపథ్యం అంటేనే సక్సెస్ఫుల్ ఫార్ములా. అయితే ఇందులో ఎక్కడా ర్యాగింగులు, ర్యాంకులగోల ఉండదు. నేటి విద్యార్థుల ప్రవర్తన, వారి సెన్సాఫ్హ్యూమర్, ఎమోషన్స్.. వీటిపైనే కథను అల్లుకున్నాడు దర్శకుడు. కాలేజ్ లైఫ్ అనేది ప్రతి వ్యక్తికీ మెమరబుల్. స్వచ్ఛమైన ఆ స్నేహాలు, ఆ అల్లర్లూ, ఆ ప్రేమలూ అవన్నీ చనిపోయేవరకూ గుర్తుంటాయి. ‘మ్యాడ్’ సినిమాతో దర్శకుడు అదే చెప్పాడు. హ్యాపీడేస్, త్రీ ఇడియట్స్, కేరింత.. ఈ సినిమాలు చేసిన మ్యాజిక్కే ‘మ్యాడ్’ కూడా చేయబోతున్నదని చెప్పొచ్చు.
ప్రథమార్థం అంతా పాత్రల పరిచయాలూ, అల్లర్లూ, కామెడీ.. ఎక్కడా విసుగు అనిపించదు. హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. ద్వితీయర్థమంతా ప్రేమజంటల రొమాన్స్, చిలిపిగొడవలూ, వెన్నెలకోసం దామోదర్ వెతుకులాట.. ఇవన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రధానపాత్రధారుల సంభాషణలు పిచ్చిగా నవ్విస్తాయి. చూసే ప్రేక్షకుడు కూడా కాలేజ్‌లో ఉన్న అనుభూతికి లోనవుతాడు.
నటీనటుల నటన..
ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ తొలి సినిమా అయినా చక్కగా చేశాడు. కామెడీనే కాక, ఎమోషన్స్ కూడా బాగా పలికించాడు. సంగీత్ శోభన్ నటన అద్భుతం. ఈ సినిమా విషయంలో అతన్ని హైలైట్‌గా చెప్పుకోవాలి. గౌరిప్రియ స్వతహాగా మంచి నటి. ఈ సినిమాలో తన పాత్రకు చక్కగా న్యాయం చేసింది. మిగతా పాత్ర ధారులంతా కొత్తవాళ్లే అయినా చక్కగా చేశారు.
టెక్నికల్‌గా..
సంభాషణలు ఈ సినిమాకు హైలైట్. మాటల్తోనే పగలబడి నవ్వించాడు దర్శకుడు కల్యాణ్‌శంకర్, శ్యామ్‌దత్, దినేష్ క్రిష్ణన్‌ల కెమెరా తెరని అందంగా చూపించింది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా అనిపించింది. కాలేజ్ క్యాపస్ వాతావరణం, పాత్రధారులు చాలా అందంగా చూపించారు. భీమ్స్ నేపథ్యసంగీతం పర్లేదనిసిస్తుంది. మొత్తంగా కేవలం యువతరాన్నే కాకుండా, అందర్నీ అలరించే సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కామెడీ, సంభాషణలు
మైనస్ పాయింట్స్
పాటలు..
రేటింగ్ : 3.25/5
మ్యాడ్ ట్రైలర్..