Year End 2023 | మన సినిమాలు ఆడొచ్చు ఆడకపోచవచ్చు. అందులో పెద్ద చిత్రమేం లేదు. ఎందుకంటే మన సినిమాలు కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ అనువాద సినిమాలు మాత్రం ఎప్పుడో కానీ ఆడవు. కొన్నేళ్లుగా డబ్బింగ్ సినిమాలకు తెలుగులో పెద్దగా టైమ్ కలిసిరావడం లేదు. కానీ అదేంటో మరి.. 2023లో మాత్రం వాటికి గోల్డెన్ టైమ్ వచ్చేసింది. కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనంతగా అనువాద సినిమాలు విజయం సాధించాయి. చాలా వరకు తమిళం, మలయాళం సినిమాలు తెలుగులో దుమ్ము లేపాయి. 50 కోట్ల క్లబ్‌లోనూ చేరిపోయాయి. కొందరైతే డబ్బింగ్ సినిమాలతోనే రెండు విజయాలు అందుకున్నారు. మరింతకీ ఏంటా డబ్బింగ్ మ్యాజిక్..?
వారసుడు:
2023 సంక్రాంతి నుంచే అనువాద సినిమాల హవా మొదలైంది. కొన్నేళ్లుగా తమిళంతో పాటు తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటున్న విజయ్.. 2023లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య లాంటి మెగా హీరోలతో పోటీ పడి మరీ తన వారసుడు సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా తెలుగులో రూ.15 కోట్ల షేర్ వసూలు చేసింది.
బిచ్చగాడు 2:
విజయ్ ఆంటోనీ అనే ఓ నటుడు ఉన్నాడనే సంగతి తెలుగు ఆడియన్స్‌కు తెలిసేలా చేసిన సినిమా బిచ్చగాడు. 2016లో విడుదలైన ఈ చిత్రం సైలెంట్‌గా వచ్చి సంచలనం విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత తన స్వీయ దర్శకత్వంలోనే బిచ్చగాడు 2 చేశాడు ఈయన. ఈ సినిమా తెలుగులో దాదాపు 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఎవరూ ఊహించని లాభాలను తీసుకొచ్చింది.
2018:
సాధారణంగా మన దగ్గర తమిళ సినిమాలు బాగా ఆడుతుంటాయి కానీ మలయాళ సినిమాలను మాత్రం చూడరు. కానీ కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన 2018 అనే మలయాళ డబ్బింగ్ సినిమా మన దగ్గర కూడా మంచి విజయాన్నే అందుకుంది. బన్నీ వాస్ ఈ సినిమాను విడుదల చేయడంతో రీచ్ బాగా పెరిగింది.
జైలర్:
చాలా ఏళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న రజినీకాంత్‌కు జైలర్ ఆ కోరిక తీర్చేసింది. తెలుగులోనే 80 కోట్ల గ్రాస్.. 48 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. నెల్సన్ తెరకెక్కించిన జైలర్ తెలుగులో మొదటి రోజు నుంచే దుమ్ము దులిపేసింది. భోళా శంకర్ ఫ్లాప్ అవ్వడంతో.. హిట్ అనుకున్న జైలర్ కాస్తా బ్లాక్‌బస్టర్ అయి కూర్చుంది.
లియో:
సంక్రాంతికి వారసుడుగా వచ్చి విజయం అందుకున్న విజయ్.. దసరాకు లియోతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు వర్షన్ 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన లియో.. కేవలం హైప్‌తోనే అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఎలా చూసుకున్నా.. 2023లో డబ్బింగ్ సినిమాలకు బాగానే కలిసొచ్చింది. ఇదే ఊపు వచ్చే ఏడాది కూడా కంటిన్యూ అయితే మన సినిమాలపై భారీ ప్రభావం తప్పదు.
ఇదే సమయంలో అజిత్ కుమార్ తెగింపు, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2, లారెన్స్ చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ ఎక్స్, కార్తి జపాన్ లాంటి సినిమాలు మంచి అంచనాల మధ్య విడుదలై దారుణంగా నిరాశ పరిచాయి. సిద్ధార్థ్ చిన్నా సినిమాకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి.