‘సినిమా చూపిస్త మావ’ ‘నేను లోకల్’ చిత్రాలతో ప్రతిభావంతుడైన రచయితగా పేరు తెచ్చుకున్నారు ప్రసన్నకుమార్ బెజవాడ. తాజాగా ఆయన రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలందించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో బెజవాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నా. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారాయన. ఈ సినిమాలో రవితేజ ధనిక, పేద వ్యక్తిగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు.
ఓ సంక్షోభాన్ని ఇద్దరూ చూసే కోణం ఏమిటన్నది కథలో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ కథ కోసం పెద్దగా కష్టపడలేదు. నాలోన ఒక చిన్న రవితేజ ఉన్నాడని ఫీలవుతుంటాను. నా గత చిత్రాల్ని చూస్తే అందులో హీరో పాత్ర చిత్రణలో రవితేజ మార్క్ కనిపిస్తుంది. తెలియకుండానే ఆయన ప్రభావం నాపై ఉంది. ఇక సినిమా రచన విషయంలో కథ తయారుచేస్తున్నప్పుడే ఎనభైశాతం మాటలు కూడా సిద్ధమవుతాయి. ముఖ్యమైన సంభాషణలకు కొంచెం టైమ్ తీసుకుంటా. చిన్న స్థాయి నుంచి వచ్చి పరిశ్రమలో సక్సెస్ కావడం ఆనందంగా ఉంది.
మనం కార్లు కొన్నామా? మంచి బట్టలు వేసుకున్నామా? అనే దాని కన్నా..అమ్మానాన్నలు కోరుకున్నవి ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, విజయం దాగి ఉంటాయని నేను నమ్ముతాను. వాళ్ల అవసరాలను తీర్చినప్పుడే జీవితంలో మనం సక్సెస్ అయినట్లని భావిస్తా. ‘ధమాకా’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా. విశ్వక్సేన్ నటిస్తున్న ‘దాస్ కా ధమ్కి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా’ అన్నారు.