Amigos Movie | ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక బిజీగా ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. గతేడాది కాస్త డల్ అయినట్లు కనిపించినా ఈ సంక్రాంతితో మళ్లీ పుంజుకుంది. ఇక సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలను దింపి 91ఏళ్ళ టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రొడక్షన్ సంస్థ చేయని సాహసం చేసింది. అంతేనా.. స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి మరీ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి విజయభేరి మోగించింది. రోజు గ్యాప్‌తో రిలీజైన వీరసింహా, వాల్తేరు సినిమాలు మైత్రీకి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం అదే ఊపులో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు రిలీజైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి. రక్త సంబంధం లేకుండా ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కలుసుకోవడం.. అసలు ఆ ముగ్గురు ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది. కలుసుకున్న తర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైయ్యాయి వంటి పలు అంశాలతో సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ చేశారు. పైగా అందులో ఒకటి నెగెటీవ్ పాత్ర అవడంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
దానికి తగ్గట్టే మైత్రీ కూడా భారీగా ప్రమోషన్లు చేస్తూ జనాల్లోకి సినిమాను బాగానే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పైగా పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో కాస్త పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా మరో బింబిసార అయ్యే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకు బిజినెస్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి జరుగలేదు. బింబిసార కంటే మూడు కోట్లు తక్కువగానే అంటే 12కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకున్న హైప్‌ను బట్టి చూస్తే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే చాన్స్ ఉంది. చూడాలి మరి మైత్రీకు ఈ సినిమా మరో జాక్‌పాట్ అవుతుందో లేదో అని.