Kalyan Ram | హిట్లు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేసే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. ఈయన ముందు సినిమాల ఫలితాలను అస్సలు బుర్రలో పెట్టుకోడు. అప్పటికప్పుడే వాటిని తీసి పక్కనబెట్టి నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టడం కళ్యాణ్ రామ్ స్టైల్. బింబిసారతో చాలా ఏళ్ళ తర్వాత గతేడాది పెద్ద హిట్ కొట్టాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన అమిగోస్ డిజాస్టర్ అయింది. అయినా కూడా ఈయన ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న డెవిల్ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.. అంతు చిక్కడం లేదు. ఈ సినిమా పోస్టర్‌పై దర్శకుడి పేరు ఎందుకు మారిపోయింది..? మొదట్లో పోస్టర్‌పై ఉన్న నవీన్ మేడారం పేరు ఇప్పుడెందుకు మాయమైంది..? డైరెక్టర్ ప్లేస్‌లో నిర్మాత అభిషేక్ నామా పేరెందుకు వచ్చింది..? దర్శకుడు, నిర్మాత మధ్య ఇగో క్లాష్ నడుస్తుందా..? అసలు డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? అనేది చాలా మందికి క్లారిటీ లేని విషయం.
తెరవెనక ఏం జరిగిందనేది కూడా కేవలం దర్శక నిర్మాతలకు తప్ప బయటి వాళ్లకు పెద్దగా క్లారిటీ లేదు. బింబిసార విజయంతో ఊపు మీదున్న కళ్యాణ్ రామ్‌ను అమిగోస్ ఫ్లాప్ పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఈయన మళ్లీ ఇప్పుడు డెవిల్తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. డెవిల్ షూట్ మొదలు పెట్టినపుడు నవీన్ మేడారం దర్శకుడు. గతంలో ఈయన బాబు బాగా బిజీ సినిమాను అభిషేక్ పిక్చర్స్‌లోనే చేసారు. నవీన్ మేడారం వర్క్ నచ్చి.. డెవిల్ సినిమాను అతడి చేతుల్లో పెట్టాడు కళ్యాణ్ రామ్, అభిషేక్ నామా. అయితే ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక నవీన్ వర్క్ నచ్చకపోవడంతో దర్శక నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫెరెన్సులు ఎక్కువైపోయానే వార్తలొచ్చాయి.
అందుకే నవీన్‌ను తొలగించి.. అభిషేక్ నామా సినిమాను డైరెక్ట్ చేసాడని తెలుస్తుంది. హీరో కూడా నిర్మాతకే సపోర్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. డెవిల్ ఫస్ట్ లుక్ వచ్చినపుడు దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది.. ఆ తర్వాత టీజర్లో అభిషేక్ నామా అండ్ టీం అని ఉంది.. మొన్న టీజర్ వచ్చినపుడు మాత్రం కేవలం అభిషేక్ నామా పేరు మాత్రమే ఉంది. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనేది వాళ్లు చెప్పాల్సిందే.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో ఈ మధ్యే విజయ్ దేవరకొండపై వివాదాస్పద కామెంట్స్ చేసిన అభిషేక్.. తాజాగా డెవిల్తో మరోసారి కేరాఫ్ కాంట్రవర్సీ అయ్యాడు. వాళ్ల మధ్య క్రియేటివ్ డిఫెరెన్సులు ఎలా ఉన్నా.. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. చూస్తుంటే కనీసం 50 కోట్లకు పైగానే ఖర్చు చేసారేమో అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. తనకు దూరమైన విజయాన్ని ఈ సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నాడీ నందమూరి హీరో. పైగా బింబిసార ఫేమ్ సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్.