Oscar Awards 2023 | సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ తొలిస్థానంలో ఉంటుంది. ఈ అవార్డును జీవితంలో ఒక్కసారైనా తాకాలని ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు ఆశ పడుతుంటారు. ఇక ఆదివారం 95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో గ్రాండ్‌గా జరుగునున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఫైనల్ నామినేషన్లో చోటుదక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే అసలు ఆస్కార్ ఎప్పుడు మొదలైంది? తొలి ఆస్కార్ విజేత ఎవరు? అనే పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్కార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది:
‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ అందించే ట్రోఫీని మొదట ‘అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్’గా పిలిచేవారు. తర్వాత ఇది ఆస్కార్గా మారింది. ఇలా ఆస్కార్గా మారాడం వెనుక ఓ కథ ఉంది. అవార్డు తొలినాళ్లలో అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన మార్గరెట్ హెర్రిక్.. ఆ ట్రోఫీ అచ్చం తన అంకుల్ ఆస్కార్‌లా కనిపిస్తుందని చెప్పారట. ఆ తర్వాత ఓ హాలీవుడ్ జర్నలిస్ట్ తన వ్యాసంలో అకాడమీ అవార్డును ఆస్కార్గా పేర్కొన్నాడట. దాంతో అప్పటి నుంచి దీన్ని ఆస్కార్గా పిలుస్తున్నారు.
ఆస్కార్ ఎప్పుడు మొదలైంది:
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారి 1929లో ది హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. తొలిసారి జరిగిన ఈ వేడుకకు 270పైగా గెస్ట్‌లు వచ్చారు. కాగా అప్పుడు 15 మంది ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,140 ఆస్కార్ అవార్డులు ప్రధానం చేయబడ్డాయి. తొలినాళ్లలో ఆస్కార్ అవార్డుల వేడుక రేడియో ద్వారా ప్రసారం అయింది.
తొలి ఆస్కార్ విన్నింగ్ నటుడు:
ఉత్తమ నటుడిగా మొదటి ఆస్కార్ అవార్డును ఎమిన్ జెన్నింగ్స్ అందుకున్నాడు. 1928లో వచ్చిన ‘ది లాస్ట్ కమాండ్’ అనే సినిమాకు ఈ అవార్డును గెలుచుకున్నాడు.
తొలి ఆస్కార్ విన్నింగ్ నటి:
ఉత్తమ నటిగా తొలి అవార్డు జనేట్ గేనోర్ గెలుచుకుంది. 1927లో విడుదలైన ‘సెవెన్త్ హెవన్’ సినిమాలోని ఆమె నటనకు ఆస్కార్ వరించింది.
తొలి ఆస్కార్ విన్నింగ్ లేడి డైరెక్టర్:
ఆస్కార్ అందుకున్న తొలి లేడి డైరెక్టర్‌గా కేథరిన్ బిగ్లో నిలిచింది. 2010లో ‘ది హర్ట్ లాకర్’ అనే సినిమాకు కేథరిన్ అస్కార్‌ను గెలిచుకుంది. అత్యధికంగా ఆస్కార్ నామినేషన్లు అందకున్న వ్యక్తిగా వాల్ట్ డిస్నీ నిలిచాడు. ఆయన మొత్తం 59 నామినేషన్లు అందుకుంటే 25 అవార్డులను గెలుచుకున్నారు. నటి మెరిట్ స్ట్రీప్ అత్యధికంగా నామినేషన్లు దక్కించుకున్న మహిళగా నిలిచింది. 21 నామినేషన్లు దక్కించుకున్న ఆమె 3 సార్లు అవార్డు గెలుచుకుంది.
ఆస్కార్ రికార్డ్స్:
అతి చిన్న వయసులో ఆస్కార్ అందుకున్న నటిగా టేటమ్ ఒ నీల్ రికార్డు క్రియేట్ చేసింది. 1973లో వచ్చిన ‘పేపర్ మూన్’ అనే సినిమాకు ఉత్తమ సహాయనటిగా టోటమ్ ఆస్కార్‌ను గెలుచుకుంది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు మాత్రమే. ఇక అతి పెద్ద వయసులో ఆస్కార్ అందుకున్న నటుడిగా ఆంథోని హాస్కిమ్స్ మరో రికార్డును క్రియేట్ చేశాడు. 2020లో వచ్చిన ‘ది ఫాదర్’ అనే సినిమాను ఉత్తమ నటుడిగా ఆంథోని ఆస్కార్‌ను అందుకున్నాడు. ఆ అవార్డు అందుకున్నప్పుడు ఆయనకు 83ఏళ్లు.
అత్యధికంగా 11 విభాగాల్లో అవార్డులు దక్కించుని ‘బెన్-హర్’, ‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలు చరిత్ర సృష్టించాయి. బెస్ట్ పిక్చర్‌గా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న ఒకే ఒక అడల్ట్ సినిమా ‘మిడ్నైట్ కౌబాయ్’.