తల్లి అతిలోకసుందరి అయినప్పుడు ఆమె పోలికలతో పుట్టిన కూతురూ అతిలోకసుందరే కదా. నిజానిక్కూడా న్యూ జనరేషన్ శ్రీదేవిలా మెరిసిపోతుంటుంది జాన్వీకపూర్. బాలీవుడ్లో తను నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం ప్రమోషన్లో ప్రస్తుతం బిజీగా ఉన్నది జాన్వీ. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగులో తాను చేస్తున్న ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘దేవర’లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా యూనిట్ సభ్యులు నాతో ప్రేమగా ఉండటం చూస్తుంటే.. ఇదంతా అమ్మ ప్రభావం అని అర్థమవుతుంది. అందరూ అంకితభావంతో పనిచేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ఇంకా చెబుతూ ‘ ‘దేవర’ భిన్నమైన కథ. తెరపై ఓ అందమైన వాతావరణం ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు ‘తంగం’. వినోదాత్మకమైన పాత్ర. కచ్చితంగా మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. అక్టోబర్10 కోసం అందరితోపాటు నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది జాన్వీకపూర్.