విశ్వంత్, శ్రీజిత ఘోష్, శుభశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణచైతన్య దర్శకుడు. దండమూడి బాక్సాఫీస్, సాయిస్రవంతి మూవీస్ పతాకంపై దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగే చిత్రమిది.
కథ వెనక కథ ఏమిటన్నది ఆసక్తికరంగా అనిపిస్తుంది’ అన్నారు. ‘మనందరి జీవితాల్లో చాలా కథలుంటాయి. వాటి వెనక జరిగిన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. అలాగే ఈ సినిమా కథ కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. లార్జ్స్కేల్లో ఈ సినిమా చేశాం’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, సునీల్, ఆలీ, రఘుబాబు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.