“నాగబంధం’ కథ విన్నప్పుడు, ఈ కథ నా కోసమే రాశారా! అనిపించింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి విన్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి పాత్ర రాదు. వెంటనే పాత్రకు తగ్గట్టు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డ్యాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇందులో నాగసాధు పాత్ర మేకప్‌కే ఆరు గంటల సమయం పట్టేది’ అని తెలిపారు హీరో విరాట్‌కర్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ఈ నెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విరాట్‌కర్ణ విలేకరులతో మాట్లాడారు. ‘దర్శకుడు అభిషేక్ నామా ఈ కథను సిద్ధం చేసుకున్న తర్వాత, ఇందులో హీరో పాత్రకు అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బావుంటుందని భావించారు. అలా ‘నాగబంధం’తో నా ప్రయాణం మొదలైంది.
ఇందులోని రుద్ర పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగాను. నాగసాధువుగా కనిపించేందుకు అయిదు కేజీలు తగ్గాను. ఈ క్రమంలో పలుసార్లు అనారోగ్యానికి కూడా గురయ్యాను. తీవ్రమైన చలిలో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఓ సందర్భంలో నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే కారవాన్‌లోకి తీసుకెళ్లి మేకప్ తొలగించి ఆపోలో ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. హార్ట్ఎటాక్ వచ్చిందేమోనని వైద్యులు సైతం అనుమానించారు. పరీక్షలు చేసి నార్మల్ అని చెప్పారు. ఆ మరుసటిరోజే షూటింగ్లో పాల్గొన్నాను. రీసెంట్గా సినిమా చూశాను. ప్రతి సన్నివేశం గూజ్బంప్స్ కలిగించింది. ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. 110కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు. రీసెంట్గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. స్పందన బాగుంది’ అని చెప్పారు విరాట్‌కర్ణ. ఇందులో నటించిన నటీనటులంతా ప్రాణం పెట్టి పనిచేశారని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నానని విరాట్‌కర్ణ ఆశాభావం వెలిబుచ్చారు.