Family Star Movie Review | హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాం లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబో లో వచ్చిన ‘గీత గోవిందం’ సూపర్ సక్సెస్ తో దాదాపు వందకోట్లపైగా వసుళ్ళూ సాధించింది. ఇలాంటి సక్సెస్ ఫుల్ కాంబో ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ కోసం మరోసారి జతకట్టింది. మంచి ఫ్యామిలీ సినిమాలని అందిస్తారనే పేరున్న దిల్ రాజు నిర్మాత కావడం ఇంకాస్త ఆసక్తిని పెంచింది. ప్రచార చిత్రాలు సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. సమ్మర్ లో ‘ఫ్యామిలీ స్టార్’ పర్ఫెక్ట్ ట్రీట్ ని చిత్ర బృందం నమ్మకంగా చెప్పింది. మరి వారి నమ్మకం నిజమైయిందా? ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ ని ఎలా అలరించాడు? ఇంతకీ కథ ఏమిటి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ :
గోవర్థన్ (విజయ్ దేవరకొండ)ది మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ల పిల్లలు, నాన్నమ్మ.. ఇలా అందరి భాద్యత తనదే. తను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ మ్యానేజర్. తన జీతంతోనే ఇల్లు గడుస్తుంది. ప్రతి పైసా జాగ్రత్త ఖర్చుపెడతాడు. గోవర్థన్ పెంట్ హోస్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు వస్తుంది. తను మెల్లగా ఆ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్థన్ ని ఇష్టపడుతుంది. గోవర్ధన్ కూడా తన మనసులో మాట చెప్పే సమయంలో ఇందు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? అసలు ఇందు ఎవరు? గోవర్థన్ ఇంటికి ఎందుకు వచ్చింది ? ఇందు గురించి నిజం తెలుసున్న గోవర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఇదంతా తెరపై చూడాలి
విశ్లేషణ : కుటుంబాన్ని భారంలా కాకుండా భాద్యతగా చూస్తూ ఆత్మాభిమానంతో బ్రతికే ఓ మధ్యతరగతి కుర్రాడి కథ ఇది. ఉమ్మడి కుటుంబాలే కాదు… ఉమ్మడి కుటుంబాల గురించి వచ్చే సినిమా కథలు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఓ ఉమ్మడి కుటుంబం, మధ్యతరగతి ఆత్మాభిమానం గురించి యూత్ తో పాటు మాస్ ఇమేజ్ వున్న విజయ్ లాంటి హీరోతో ఇలాంటి కథ చెప్పడం మంచి ప్రయత్నం. విజయ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ మిడిల్ క్లాస్ కుటుంబంలోని సంగతులని సరదగా చూపిస్తూ కథని ముందుకు నడిపాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అలరించడంతో పాటు ప్రేక్షకుల మనసులో విజయ్ పాత్ర సహజంగా లీనం అవుతుంది. ఇందు పాత్ర ఎంట్రీ తర్వత సన్నివేశాలు ఇంకాస్త గమ్మత్తుగా వుంటాయి. ఐతే విజయ్ అన్న పాత్రలో ఎదో బలమైన సంఘర్షణ వుందని భావించిన ప్రేక్షకుడికి ఆ ట్రాక్ కాస్త నిరాశ పరుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బావుంది. ఇందు గురించి నిజం తెలుసుకున్నాక.. విజయ్ ఇచ్చే రియాక్షన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే అమెరికా ఎపిసోడ్ లో వేగం తగ్గింది. పైగా అందులో సన్నివేశాలు చాలా నింపాదిగా సాగుతుంటాయి. క్లైమాక్స్ లో కథ మళ్ళీ వేగం పుంజుకుంటుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా కంటెంట్ ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది.
నటీనటులు:
ఫ్యామిలీ స్టార్ ని సింగిల్ హ్యాండ్ తో మోసాడు విజయ్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో తనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు. మృణాల్ అందంగా కనిపించింది. ఇందు పాత్రని హుందాగా చేసింది. అయితే సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రని పూర్తిగా మ్యూట్ చేయడం అంతగా ఆకట్టుకోదు. జగపతి బాబు రొటీన్ పాత్రలోనే కనిపించారు. వెన్నెల కిశోర్ పాత్ర అంతగా నవ్వులు పంచలేదనే చెప్పాలి. వాసుకి, రోహిణి అట్టంగడి, ప్రభాస్ శ్రీను తో పాటు మిగతా పాత్రలు పరిధిమేరకు వున్నాయి.
సాంకేతికంగా :
గోపిసుందర్ పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. నేపధ్య సంగీత చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసింది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. విజువల్స్ ని రిచ్ గా తీశారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం పదునుగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. దర్శకుడు రాసుకున్న మాటలు కొన్ని అలరిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కొరుకునే కంటెంట్ ని ఇవ్వడంలో దర్శకుడు పరశురాం మంచి పనితీరు కనబరిచారు. ఈ వేసవిలో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కోసం చూసే ఆడియన్స్ కి ఫ్యామిలీ స్టార్ మంచి ఆప్షనే.
ప్లస్ పాయింట్స్
విజయ్, మృణాల్, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
తెలిసిన కథే, సెకండ్ హాఫ్ నెమ్మది, తగ్గిన ఎమోషన్
రేటింగ్: 3/5