సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
తెలుగు చిత్రసీమను విషాదాలు వెంటాడుతున్నాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతి రావు (78) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో పరిశ్రమలో విషాదం నెలకొంది.
తెలుగు చిత్రసీమను విషాదాలు వెంటాడుతున్నాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతి రావు (78) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో పరిశ్రమలో విషాదం నెలకొంది. యాభైఏండ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలిచారు చలపతిరావు. 1200లకుపైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ఇండస్ట్రీలోని సన్నిహితులందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే చలపతిరావు మరణంతో తెలుగు పరిశ్రమ మరో గొప్ప నటుణ్ణి కోల్పోయింది.
చలపతిరావు 1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రులో జన్మించారు. కాలేజీ రోజుల్లోనే నాటకాల్లో రాణించారు. తొలుత హీరో అవుదామనే లక్ష్యంతో మద్రాస్‌లో అడుగుపెట్టిన ఆయన ప్రతినాయక పాత్రల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ‘కథానాయకుడు’ (1969) చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమాలో మున్సిపల్ కమిషనర్‌గా చిన్న పాత్ర వేశారు. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా మొదటి ఐదారేళ్లు ఎక్కువగా ఆయన సినిమాల్లోనే నటించారు చలపతిరావు.
‘దానవీర శూరకర్ణ’లో ఐదు గెటప్‌లు..
ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలో చలపతిరావు ఐదు పాత్రల్ని పోషించారు. ఆ సినిమాలో ఇంద్రుడు, సూతుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో చక్కటి అభినయంతో మెప్పించారు. ‘దాన వీర శూరకర్ణ’ చిత్రం ద్వారా లభించిన గుర్తింపుతో చలపతిరావుకు వరుస సినిమా అవకాశాలు వరించాయి. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా బిజీ అయ్యారు. నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం నటుడిగా చలపతిరావును కొత్త కోణంలో ఆవిష్కరించింది. అప్పటివరకు విలనీ రోల్స్‌లో ఎక్కువగా కనిపించిన ఆయన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరో తండ్రిగా ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ కంటే ముందు ఆడవాళ్లు తనను చూస్తే భయపడి పోయేవారని, ఆ సినిమా తర్వాతే ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం, షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం మొదలైందని, కెరీర్ ఊపందుకుందని చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా తర్వాత బాబాయ్, తండ్రి పాత్రలతో పాటు కామెడీ క్యారెక్టర్స్‌లో మెప్పించారు చలపతిరావు.
నిర్మాతగా గుర్తింపు
ఆర్సీ క్రియేషన్స్ సంస్థను స్థాపించి కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం వంటి సినిమాల్ని నిర్మించారు చలపతిరావు. ఆయన కెరీర్లో యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీమ్ అనార్కలీ, భలే కృష్ణుడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, సింహాద్రి, అల్లుడా మజాకా, బొమ్మరిల్లు, సింహా, అరుంధతి, లెజెండ్ వంటి చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. గత ఏడాది విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం తర్వాత చలపతిరావు తెరపై కనిపించలేదు.
బుధవారం అంత్యక్రియలు
చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా, కొడుకు రవిబాబు ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని తన కుమారుడి నివాసంలోనే చలపతిరావు ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం చలపతిరావు భౌతికకాయాన్ని కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఉంచారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని మహాప్రస్థానం ఫ్రీజర్‌లో భద్రపరుస్తామని, అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చిన తర్వాత బుధవారం రోజున జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
సినీ రంగానికి తీరని లోటు
తెలుగు వెండితెరపై చలపతిరావు తనదైన ముద్రవేశారు. వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి మెప్పించారు. ఆయన మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు. చలపతిరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
-సీఎం కేసీఆర్
అందరితో ఆప్యాయంగా ఉండేవారు
మూడుతరాలకు చెందిన నటులతో 1250కి పైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు చలపతిరావు. పరిశ్రమలోని అందరితో అప్యాయంగా ఉండేవారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
-మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ఆయనతో ఎన్నో సినిమాలు చేశా
విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావుగారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-చిరంజీవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్



