దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిత్రసీమలోకి రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ హీరో వేణు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్‌జంక్షన్, ఖుషీఖుషీగా వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రంలో వేణు కీలక పాత్రలో నటించారు. శరత్‌మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం వేణు పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
మా కుటుంబానికి చాలా వ్యాపారాలున్నాయి. వాటి పనుల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు విరామం తీసుకున్నా. ఈ మధ్యలో చాలా మంది నన్ను సంప్రదించారు. అసలు సినిమాల గురించి ఆలోచించే తీరికే లేనందువల్ల సున్నితంగా తిరస్కరించాను. అయితే కరోనా లాక్డౌన్ టైమ్ నా ఆలోచనల్ని మార్చివేసింది. అప్పుడు చాలా వెబ్ సిరీస్‌లు చూశాను. ఇలాంటి మంచి పాత్రలు చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ తర్వాత ‘రామారావు ఆన్‌డ్యూటీ’ దర్శకుడు శరత్ మండవ నన్ను కలిసి కథ చెప్పాడు. నా పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో సినిమాకు అంగీకరించాను.
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. కెరీర్ ఆరంభం నుంచి నాకు మల్టీస్టారర్ సినిమాలంటే ఇష్టం. చాలా మంది హీరోలతో సినిమాలు చేశాను. రవితేజతో సినిమా అనగానే హ్యాపీగా ఫీలయ్యా. సెట్స్‌లో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఈ సినిమాలో నా పాత్ర రవితేజ క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి వుంటుంది. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా సీన్స్ ఉంటాయి.
త్రివిక్రమ్ మాటలందించిన కొన్ని చిత్రాల్లో నేను కథానాయకుడిగా నటించా. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. ‘అతడు’ సినిమాలో సోనూసూద్ చేసిన పాత్రకు తొలుత నన్నే తీసుకోవాలనుకున్నారు. ఎందుకనో కుదరలేదు. రవితేజ వంటి కమర్షియల్ హీరో సినిమా కావడం వల్ల నా పాత్ర చాలా మందికి రీచ్ అవుతుందనే ఉద్ధేశ్యంతో ఈ సినిమాకు ఒప్పుకున్నా. మళ్లీ నా గురించి ప్రేక్షకులు మాటాడుకుంటారనుకుంటున్నా. నటుడిగా ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోలేదు. నేను విధిని నమ్ముతాను. జీవితం మాదిరిగానే కెరీర్ కూడా పడుతూలేస్తూ సాగిపోతుంటుంది. ఫలితం ఎలా ఉన్నా నేను ప్రయాణాన్ని ఆస్వాదిస్తా. ఈ సినిమాకు నేను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కొత్త అనుభూతినిచ్చింది.
ప్రస్తుతం ఛాయ్బిస్కెట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఓ మూవీలో నటిస్తున్నా. వాస్తవానికి వెబ్ సిరీస్‌లు చూసి ఇంప్రెస్ అయ్యాను కాబట్టే మళ్లీ సినిమాలు చేయాలనిపించింది. భవిష్యత్తులో వెబ్ మూవీస్, సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా చేస్తాను. ఇండస్ట్రీలో మళ్లీ నిలదొక్కుకోవడానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం మంచి వేదికలా నిలుస్తుందనుకుంటున్నా. నా మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటూ సినీ కెరీర్ కొనసాగించాలనుకుంటున్నా.