Venkatesh | టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ఒకటి. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల కల్యాణ్ రామ్‌పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించిన చిత్రబృందం, ఇప్పుడు తదుపరి కీలక షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో విక్టరీ వెంకటేష్ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో షూటింగ్ మరింత జోరందుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటున్నారు. ముఖ్యంగా వెంకటేష్–కల్యాణ్ రామ్‌ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, వినోదభరితమైన సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ కథా చిత్రాలకు వినోదాన్ని జోడించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి, ఈ సినిమాలో కూడా తన మార్క్ కామెడీ, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించేలా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. ఈ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూనే కథ సాగనున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, తాజా షూటింగ్ అప్డేట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.