VeeraBhadrudu | తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వీరభద్రుడు’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా సినిమా విడుదలపై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ, చివరికి మేకర్స్ ముందుగా ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలని ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సూర్య అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు ఆయన తమ్ముడు, హీరో కార్తీ కూడా హాజరయ్యారు. తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే ఈ స్టార్ బ్రదర్స్, టైమ్ తక్కువగా ఉండటంతో ఒకే ఈవెంట్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కోర్ట్‌రూమ్ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన కథగా కనిపిస్తోంది. రౌడీ లాయర్లను ఉపయోగిస్తూ కోర్టును తన ఆధీనంలో నడిపించే దుర్మార్గుడు బేబీ కృష్ణ పాత్రలో ఆర్జే బాలాజీ కనిపించగా, అమాయక తండ్రి కూతురికి న్యాయం చేస్తానని చెప్పి చివరకు మోసం చేసే వ్యక్తిగా ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంది. అలాంటి సమయంలో న్యాయం కోసం తిరిగి రంగంలోకి దిగే వీరభద్ర పాత్రలో సూర్య పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఒకప్పుడు నల్లకోటు వదిలేసిన ఆయన, అన్యాయాన్ని ఎదిరించేందుకు మళ్లీ కోర్టులో అడుగుపెడతాడు. అయితే ఈసారి కేవలం వాదనలు మాత్రమే కాదు, అవసరమైతే కత్తి పట్టుకుని శత్రువులను ఎదుర్కొనేంత ఆగ్రహంతో ఆయన పాత్రను డిజైన్ చేసినట్లు ట్రైలర్లో చూపించారు.
కథ పరంగా పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా, బాలీవుడ్లో వచ్చిన జాలీ ఎల్ఎల్బీ తరహా కోర్ట్‌రూమ్ వైబ్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసినట్లు అనిపిస్తోంది. అదే సమయంలో దైవత్వానికి సంబంధించిన అంశాలు కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ట్రైలర్ చివర్లో కనిపించిన తెల్ల మీసాల వృద్ధుడి షాట్ వెనుక ఓ కీలక సస్పెన్స్ దాచినట్లు తెలుస్తోంది.సినిమాకు సంగీతం అందించిన సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన బలం అయింది. హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, ట్రైలర్లో ఆమెను కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రమే చూపించారు. ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే ‘వీరభద్రుడు’కు మంచి అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి తర్వాత తెలుగులో పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా పెద్దగా రాకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశముంది. ఇటీవల వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ట్రేడ్ కూడా కొత్త భారీ సినిమాకోసం ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం చెప్పుకోదగ్గ పోటీ కూడా లేకపోవడంతో, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం సూర్యకు బలమైన కంబ్యాక్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.