Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘బరి’ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు యదు వంశృ తెరకెక్కిస్తున్నారు.సమాచారం ప్రకారం, మంగళవారం ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం అయింది. వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని సూచించగా, వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ‘బరి’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుండగా, అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్తో కూడిన హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కొత్త లుక్లో కనిపించనున్నారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ గాయంపై సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “గెట్ వెల్ సూన్” అంటూ పోస్టులు చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి అనూహ్య ఘటనతో షూటింగ్కు తాత్కాలిక విరామం వచ్చినప్పటికీ, చిత్ర బృందం మాత్రం వరుణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత జోష్తో సినిమా పనులు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.