రివ్యూ: ఊర్వశివో రాక్షసివో
తారాగణం: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, ఆమని, పృథ్వీ, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: తన్వీర్
సంగీతం: అనూప్ రూబెన్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అచ్చు రాజమణి
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, విజయ్.ఎం
నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్
దర్శకత్వం: రాకేష్ శశి
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత యువ హీరో అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. కథల్లో కొత్తదనానికి పెద్దపీట వేసే జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ‘ఊర్వశివో రాక్షసివో..’ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం..
కథేమిటంటే:
శ్రీకుమార్ (అల్లు శిరీష్), సింధూజ (అనూ ఇమ్మాన్యుయేల్) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఇద్దరివీ పూర్తి భిన్న మనస్తత్వాలు. మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రుల ఆంక్షల మధ్య సతమతమవుతుంటాడు శ్రీకుమార్. అందుకు పూర్తి భిన్నంగా ఆధునిక భావాలతో జీవితాన్ని సాగిస్తుంటుంది సింధూజ. ఈ జంట మధ్య ప్రేమ చిగురిస్తుంది. తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలైపోవాలనుకుంటాడు శ్రీకుమార్. పెళ్లి అంటే బాధ్యతల్లో బందీ కావడమే..సహజీవనం ఉత్తమమనే అభిప్రాయంతో సింధూజ ఉంటుంది. ఈ జంట మధ్య భావాల సంఘర్షణ చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? భిన్న కుటుంబ నేపథ్యాలు కలిగిన ఈ జంట ప్రేమ ప్రయాణం ఏ తీరాలకు చేరిందన్నదే మిగతా చిత్ర కథ..
కథా విశ్లేషణ:
భిన్న నేపథ్యాలు కలిగిన జంట నడుమ ప్రేమాయణం..వారి మధ్య సంఘర్షణ నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలొచ్చాయి. పాయింట్ ఎంత పాతదైనా కథను ఎంత కొత్తగా, ఎంగేజింగ్‌గా చెప్పామనే విషయానికే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈ అంశంలో దర్శకుడు రాకేష్ శశి పూర్తిగా సఫలీకృతుడయ్యారు. నాయకానాయికల పరిచయ ఘట్టాలతోనే వారి మనస్తత్వాలేమిటో..భిన్న ధృవాలైన వారి మధ్య ప్రేమాయణం ఎలా సాగబోతుందనే ఆసక్తిని క్రియేట్ చేశారు. తన కొలీగ్ సంతోష్ (వెన్నెల కిషోర్), మావయ్య చిట్టి (సునీల్) సలహాల మేరకు సింధూజను ప్రేమలో దింపడానికి శ్రీ చేసే ప్రయత్నాలు ప్రథమార్థంలో చక్కటి వినోదాన్ని పంచాయి. పబ్ పార్టీలో సింధూ..శ్రీకుమార్‌కు తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ వేగం పుంజుకుంటుంది. అయితే పార్టీలో తాను క్యాజువల్‌గా చెప్పిన మాటల్ని ప్రేమ అనే కోణంలో తీసుకోవద్దని సింధూజ చెప్పడంతో శ్రీకుమార్లో సంఘర్షణ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఎమోషన్‌గా సాగాయి. బ్రేకప్ ఎపిసోడ్‌తో ప్రథమార్థాన్ని ముగించడం ఆసక్తిని పెంచింది.
శ్రీకుమార్, సింధూజల సహజీవనంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఈ క్రమంలో పండే కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. లివింగ్ రిలేషన్లో శ్రీకుమార్ పడే పాట్లను వెన్నెల కిషోర్, సునీల్ క్రికెట్ కామెంటరీగా చెప్పడం కావాల్సినంత వినోదాన్ని పంచింది. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్ని దర్శకుడు బలంగా రాసుకున్నాడు. ప్రేమ, పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య అభిప్రాయభేదాలు, ఇగో సమస్యల్ని హార్ట్‌టచింగ్‌గా తెరపై తీసుకొచ్చాడు. కథ ఆసాంతం నవ్వులతో సాగినా ప్రీక్లెమాక్స్ ఘట్టాల్లో మాత్రం భావోద్వేగాలు పండాయి. అయితే క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో వినోదం ప్రధానబలంగా నిలిచింది. వెన్నెల కిషోర్, సునీల్ ఆద్యంతం చక్కటి కామెడీని పండించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
అల్లు శిరీష్ నటనలో పరిణితి కనిపించింది. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఘట్టాల్లో చక్కటి నటన కనబరిచాడు. నాయిక అనూఇమ్మాన్యుయేల్ అందం, అభినయంతో మెప్పించింది. ఇక ఈ సినిమాకు తమదైన వినోదంతో వెన్నెల కిషోర్, సునీల్ ప్రధానాకర్షణగా నిలిచారు. కథానాయకుడిగా తల్లి పాత్రలో సీనియర్ నటి ఆమని తనదైన అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. నాయిక తండ్రిగా పృథ్వీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తన్వీర్ సినిమాటోగ్రఫీ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను కలర్ఫుల్గా ప్రజెంట్ చేసింది. అనూప్‌రూబెన్స్ పాటలు మెలోడీ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. అచ్చు రాజమణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. నిర్మాణపరంగా మంచి క్వాలిటీ కనిపించింది. పాత కథను చాలా కొత్తగా, తనదైన కామెడీ సెన్సిబిలిటీస్‌తో ప్రజెంట్ చేశారు దర్శకుడు రాకేష్ శశి.
తీర్పు:
న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా, ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే వినోదంతో ‘ఉర్వశివో రాక్షసివో.’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3/5.