న్యూమెక్సికో: రెండు సార్లు అస్కార్ అవార్డు అందుకున్న జీన్ హ్యాక్‌మాన్(Gene Hackman).. అమెరికాలోని తన నివాసంలో శవమై తేలాడు. న్యూమెక్సికోలోని శాంటా ఫీ ఇంట్లో అతని మృతదేహాన్ని గుర్తించారు. ఆయన భార్య బెట్సీ అరకావా, కుక్క కూడా ఆ ఇంట్లో ప్రాణాలు కోల్పోయి ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. శాంటా ఫీ కౌంటీ పోలీసు అధికారి ఆడన్ మెండోజా ముగ్గురి మరణాలను ద్రువీకరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్లు చెప్పారు. ద ఫ్రెంచ్ కనెక్షన్ చిత్రంలో నటించిన హ్యాక్మాన్కు ఆస్కార్స్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇక అన్ఫర్గీవన్ చిత్రంలో ఆయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఆస్కార్స్‌తో పాటు రెండు సార్లు బాఫ్టా, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు.
జీన్‌హ్యాక్‌మాన్ 1930లో కాలిఫోర్నియాలో జన్మించారు. ఆయన వందకుపైగా పాత్రలు పోషించారు. ఏ కారణం చేత హ్యాక్‌మాన్ జంట ప్రాణాలు కోల్పోయిందో తెలియదని పోలీసు అధికారి చెప్పారు. 1970, 80 దశకాల్లో రిలీజైన సూపర్మాన్ చిత్రాల్లో ఆయన లెక్స్ లూథర్ పాత్రను పోషించారు. రన్ అవే జ్యూరీ, ద కన్వర్జేషన్, ద రాయల్ టీనెన్బౌమస్ లాంటి హిట్ చిత్రాలో ఆయన నటించారు. 2004లో చివరిసారి ఆయన వెల్కమ్ టు మూస్పోర్ట్ చిత్రంలో నటించారు.
ఆయన ఆర్మీలో నాలుగున్నర ఏళ్లు పనిచేశాడు. మిలిటరీ తర్వాత కొన్నాళ్లు న్యూయార్క్‌లో చేశాడు. ఆ తర్వాత కెరీర్‌ను యాక్టింగ్ వైపు మళ్లించాడు.