Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న యశ్ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతో విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలు, అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్, పెంచిన టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’కు సోషల్ మీడియాలో ప్రస్తుతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్స్‌లో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఈ సినిమాలో యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి నుంచే పెద్దల కోసం రూపొందించిన చిత్రమని ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగానే యాక్షన్, వైలెన్స్‌తో పాటు బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రేక్షకుల స్పందనల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన స్పందన సినిమాకి రావడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కథనం, స్క్రీన్‌ప్లే, పాత్రల రూపకల్పనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా తొలి భాగం చాలా నెమ్మదిగా, గందరగోళంగా సాగిందని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కథలో స్పష్టత లేకపోవడం, సన్నివేశాలు ఒకదానితో ఒకటి బలంగా కనెక్ట్ కాకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు.
అయితే యశ్ ఎంట్రీ, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, భారీ సెట్ డిజైన్లు మాత్రం ఆకట్టుకున్నాయని పాజిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. కియారా అద్వానీ, నయనతార నటనకు కూడా కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సినిమాలో కొన్ని చోట్ల ‘కేజీఎఫ్’ తరహా ఛాయలు కనిపించాయని పేర్కొంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా అనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేవని కొందరు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా నిడివి ఎక్కువగా ఉందని, కథనంలో మరింత వేగం ఉండాల్సిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా రెండో భాగంపై కూడా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌ను సినిమాకు ప్రధాన బలాలుగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కథనం చివరి వరకు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని విమర్శిస్తున్నారు.ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్‌పై కూడా కొంత నెగెటివ్ టాక్ కనిపిస్తోంది. డబ్బింగ్, డైలాగ్ రైటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్’కు తొలి రోజు సోషల్ మీడియా వేదికగా మిక్స్డ్ టాక్ కనిపిస్తోంది. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, విజువల్ మేకింగ్ వంటి అంశాలు కొంతమందిని ఆకట్టుకుంటుండగా.. కథ, స్క్రీన్‌ప్లే, నిడివి, ఎమోషనల్ కనెక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి.
అయితే సోషల్ మీడియా స్పందన కంటే సాధారణ ప్రేక్షకుల మౌత్ టాక్, రాబోయే రోజుల్లో వచ్చే కలెక్షన్లే సినిమా అసలు ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. భారీ థియేట్రికల్ రిలీజ్‌తో వచ్చిన ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది, మిక్స్డ్ టాక్‌ను దాటుకుని సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.