Toxic | రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి తొలి రోజు ఎక్కువగా మిశ్రమ, ప్రతికూల స్పందన వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా విడుదలకు ముందు నెలకొన్న భారీ హైప్ మాత్రం టికెట్ సేల్స్‌లో స్పష్టంగా కనిపించింది.‘టాక్సిక్’ విడుదలైన తొలి రోజే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో 9.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఒక్క రోజులోనే ఇంత భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు కావడంతో సినిమా కొత్త రికార్డు సృష్టించిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ స్థాయి అడ్వాన్స్, ఓపెనింగ్ డే బుకింగ్స్‌కు ప్రధాన కారణం యశ్‌కు ఉన్న భారీ పాన్ ఇండియా క్రేజ్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు ‘టాక్సిక్’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సినిమాకు తొలి షోల నుంచే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు సినిమా టెక్నికల్ అంశాలు, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్రశంసిస్తుండగా.. మరికొందరు కథనం, స్క్రీన్‌ప్లే, సినిమా నిడివిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఓపెనింగ్ డే టికెట్ సేల్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగానే భారీగా నమోదయ్యాయి. ఇప్పుడు అసలు పరీక్ష రాబోయే రోజుల్లో సినిమా తన జోరును కొనసాగిస్తుందా లేదా అన్నదే. ముఖ్యంగా తొలి వారాంతంలో కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన ‘టాక్సిక్’ బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రభావితం చేయనుంది. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యశ్ తన పాత్రతో అదగొట్టారు. ఆయనతో పాటు స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. సుదేవ్ నాయర్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. ఒక్క రోజులోనే 9 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా ‘టాక్సిక్’ తనపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపించింది.