Toxic | ‘డ్యాడీ ఈజ్ హోమ్’ అంటూ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్‌తో పాటు భారీ స్థాయిలో జరిగిన ప్రమోషన్స్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచాయి. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా డివైడ్ టాక్ వినిపిస్తోంది. హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాలు ఆకట్టుకుంటున్నప్పటికీ, కథనం విషయంలో మాత్రం కొంతమంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మనం ఊహించిన సినిమా ఇది కాదే.. కథ ఇలా సాగుతుందేంటి అంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్న కొందరు ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం తీసుకుని యశ్ చేసిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు పెద్ద స్థాయి స్టార్కాస్ట్ ఉండటంతో సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్‌గా ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతుండగా, మరికొందరు మాత్రం సినిమా కథనం, స్క్రీన్‌ప్లేలో ఎక్కడో తేడా కొట్టిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకుల్లో కొంతమంది ఊహించిన స్థాయిలో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడలేదని అంటున్నారు.
‘టాక్సిక్’కు డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె సరదాగా మాట్లాడుతూ.. “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి.. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ” అని చెప్పారు. దీంతో ఈ వీడియోను ప్రస్తుతం ‘టాక్సిక్’ పరిస్థితికి ముడిపెడుతూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని కొందరు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం “ఓహో.. డైరెక్టర్‌కు ముందే క్లారిటీ ఉందన్నమాట!” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.