Tollywood | 2026 జూన్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు భారీ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. విభిన్న జోనర్లలో తెరకెక్కిన సినిమాలు వరుసగా థియేటర్లలోకి రానుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు, హారర్ కామెడీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, స్పోర్ట్స్ డ్రామాలు ఇలా అన్ని రకాల సినిమాలు ఈ నెలలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. జూన్ మొదటి వారంలోనే టాలీవుడ్ బాక్సాఫీస్‌కు భారీ ఊపు రానుంది. జూన్ 3న ‘అసురాసుర’ సినిమా విడుదల కానుంది. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇక జూన్ 4న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేశాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. అదే వారంలో జూన్ 5న ‘రావ్ బహదూర్’ విడుదల కానుంది. అలాగే హాలీవుడ్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ కనిపించనుంది. జూన్ రెండో వారం మాత్రం కాస్త నెమ్మదిగా ఉండనుంది. జూన్ 11న ‘సంగీతం’ అనే సినిమా మాత్రమే విడుదల కానుంది. సంగీతం ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై సంగీత ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే అసలు పోటీ మాత్రం జూన్ మూడో వారంలో కనిపించనుంది. జూన్ 19న ఒకేసారి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ‘బాలన్ ది బాయ్’, ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’, హారర్ కామెడీ మూవీ ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. ఈ నాలుగు చిత్రాలు పూర్తిగా భిన్నమైన జోనర్లలో ఉండటంతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా హారర్ కామెడీ సినిమాలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’పై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.
జూన్ చివరి వారం మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా ఉండనుంది. జూన్ 26న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. అదే రోజున స్పోర్ట్స్ డ్రామా ‘సూపర్ గోల్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఇంటెన్స్ డ్రామా ‘లెనిన్’ కూడా జూన్ 26నే విడుదల కానుండటం విశేషం. దీంతో నెలాఖరులో మూడు ప్రధాన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. మొత్తం మీద చూస్తే 2026 జూన్ నెల టాలీవుడ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోందనే చెప్పాలి. భారీ పాన్ ఇండియా సినిమాల నుంచి చిన్న కాన్సెప్ట్ మూవీస్ వరకు అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందో చూడాలి.