హైదరాబాద్: హంసానందిని తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసన పేరు. ఆమె తన కేరీర్లో తెలుగు సినిమాల్లో ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించింది. గతంలో ఆమె కరోనా మహమ్మారి బారినపడి పూర్తిగా కోలుకున్నది. అయితే, కొన్ని నెలల క్రితం ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో సినిమాలకు దూరమైంది. తాజాగా హంసానందిని ఈ విషయాన్ని వెల్లడించింది. తాను బ్రెస్ట్ క్యాన్సర్తో గట్టిగా పోరాడుతున్నానని, త్వరలోనే కోలుకుని సినిమాల్లోకి తిరిగి వస్తానని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా హంసానందినికి ప్రస్తుతం కీమో థెరపీ, రేడియేషన్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం హంసానందిని తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించారని వైద్యులు తెలిపారు. వివిధ పరీక్షలు చేసిన తర్వాత హంసానందినికి కూడా ఆమె తల్లి నుంచి వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలిందని చెప్పారు. ఏదేమైనా హంసానందిని త్వరగా క్యాన్సర్ బారినుంచి కోలుకుని తిరిగి సినిమాల్లోకి రావాలని ఆశిద్దాం.