Maanaadu Movie Telugu Remake | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ‘బాహుబలి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రానా కమర్షియల్‌గా భారీ హంగులతో తెరకెక్కే సినిమాల జోలికి పోలేడు. కేవలం కంటేంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. వసూళ్ళ సంగతి పక్కనపెడితే ఇలాంటి కథను ఒప్పుకున్న రానాను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. హీరోయిన్ పాత్ర డామినేటెడ్ అని తెలిసిన రానా ఈ సినిమాను చేశాడు. ప్రస్తుతం ఈయన నటుడిగా, నిర్మాతగా బిజీ బిజీగా ఉన్నాడు.
అయితే తాజాగా రానా మరో రీమేక్‌లో నటించడానికి సిద్ధమయ్యాడు. గతేడాది తమిళంలో సూపర్ హిట్టయిన చిత్రాల్లో ‘మానాడు’ ఒకటి. చాలా కాలం తర్వాత శింబు ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు హక్కులను సురేష్ ప్రొడక్షన్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు? అనే ప్రశ్న ప్రతి సినీ ప్రేక్షకుడి మదిలో ఉండిపోయింది. తాజాగా ఈ చిత్రంలో రానా హీరోగా నటిస్తున్నట్లు కన్ఫార్మ్ అయింది. యువ హీరో నాగచైతన్య ఈ విషయాన్ని స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వూలో రానా ‘మానాడు’ రీమేక్‌లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన వెంకట్ ప్రభు తెరకెక్కిస్తాడా? లేకపోతే మరో దర్శకుడి రంగంలోకి దిగనున్నాడా ? అనేది తెలియాల్సింది. వెంకట్ ప్రభు ప్రస్తుతం నాగచైతన్యతో ద్విభాష చిత్రాన్ని చేయడానికి ముస్తాబవుతున్నాడు.