Year End 2023 | 2023 అలా చూస్తుండగానే అయిపోయింది. మన కళ్ల ముందుకు మరో కాలెండర్ ఇయర్ వచ్చేసింది. 2023లో రావాల్సిన హీరోలంతా వచ్చేశారు.. కొందరైతే రెండుసార్లు వచ్చారు కూడా. కానీ కొందరు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే ఒక్కటి కాదు రెండు మూడేళ్లుగా రాని హీరోలు కూడా మన దగ్గర ఉన్నారు. పాన్ ఇండియన్ మత్తులో పడి ఒక్కో సినిమా కోసం ఏళ్లకేళ్లు తీసుకుంటున్నారు. అలా పాత ఏడాదిలో రాలేక.. కొత్త ఏడాదిలో వస్తామంటూ మొండికేస్తున్నారు. 2024 మాదే అంటున్నారు వాళ్లు. మరి ఎవరా హీరోలు.. 2023లో మిస్సయ్యి.. 2024పై ఫోకస్ చేసిన హీరోలెవరో చూద్దాం..
అల్లు అర్జున్:
2021 డిసెంబర్లో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. 2022, 23లలో ఒక్క సినిమా కూడా రాలేదు. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2పైనే అల్లు అర్జున్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. 2024 ఆగస్ట్ 15న విడుదల కానుంది పుష్ప 2.
రామ్ చరణ్:
రాజమౌళితో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నెక్ట్స్ సినిమాను కూడా అదే స్థాయిలో ప్రిపేర్ చేయాలంటే కచ్చితంగా ఎక్కువ టైమ్ పడుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. పైగా అక్కడున్నది శంకర్ కావడంతో.. చరణ్ కెరీర్ నుంచి 2023 ఖాళీగా వెళ్లిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్:
ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు 2019, 2020, 2021 ఖాళీగా వదిలేశాడు జూనియర్ ఎన్టీఆర్. 2022లో ట్రిపుల్ ఆర్ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత భారీ గ్యాప్ తప్పలేదు. చూస్తుండగానే 2023 అయిపోయింది. 2024 ఏప్రిల్ 5న దేవరతో రానున్నాడు తారక్. అది కూడా మొదటిభాగం మాత్రమే. అయితే 2025లో మాత్రం దేవర 2తో పాటు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా విడుదల చేయాలని చూస్తున్నాడు జూనియర్.
మహేశ్ బాబు:
సర్కారు వారి పాట తర్వాత తెలియకుండానే మహేశ్ కెరీర్లో భారీ బ్రేక్ తప్పలేదు. త్రివిక్రమ్ సినిమాను 2022లోనే మొదలు పెట్టినా.. ఆయన తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరా దేవి మరణాలతో బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు మహేశ్. అన్నయ్య మరణం నుంచి కోలుకోక ముందే.. తల్లిదండ్రులు కూడా దూరమవ్వడంతో ఆ ప్రభావం సినిమాపై పడింది. అందుకే గ్యాప్ పెరిగింది. జనవరి 12న గుంటూరు కారంతో వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్.
వెంకటేశ్:
వెంకటేశ్ సైతం 2023లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈయన సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జనవరి 13న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది వెంకటేశ్‌కు 75వ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కాభాయ్ కిసీ కా జాన్ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో నటించాడు. కానీ అది హిందీ సినిమా.
నాగార్జున:
2022లో బంగార్రాజు, ది ఘోస్ట్ లాంటి సినిమాలతో వచ్చిన నాగార్జున.. 2023ను మాత్రం ఖాళీగానే వదిలేశాడు. ఈ మధ్యే నా సామిరంగాను మొదలుపెట్టిన నాగ్.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడు.