మరో హీరోతో పోల్చుకోను
కెరీర్ విషయంలో ఎక్కువ ఆరాటపడనని, మరో హీరో ఏం చేస్తున్నాడని ఆలోచించనని చెబుతున్నారు హీరో విక్టరీ వెంకటేష్. ఇతర హీరోలతో పోల్చుకునే అలవాటు లేదంటున్న ఆయన..తనకొచ్చే సినిమాల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని తెలిపారు. వరుణ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన సినిమా ‘ఎఫ్ 3’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన తన అనుభవాలను, కెరీర్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్ పంచుకున్నారు.
ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మీ ఇమేజ్ గురించి ఆలోచించలేదా?
నేను నా ప్రతి సినిమాలో ఒక కొత్త నటుడిలాగే నటిస్తా. నా స్టార్డమ్, ఇమేజ్ గురించి ఆలోచించను. కామెడీ మూవీస్ చేసేప్పుడు సెట్లోకి వెళ్లగానే నాలో తెలియని ఉత్సాహం వస్తుంటుంది. నా కాలేజ్ రోజుల్లో స్నేహితులతో ఉన్నంత సరదాగా మారిపోతాను. సహజంగా నేను సరదా మనిషిని. షూటింగ్ టైమ్‌లో నవ్వుతూ నవ్విస్తూ ఉండటం బాగుంటుంది.
రెండేళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది?
ప్రేక్షకుల మధ్య సినిమా చూసిన అనుభూతి వేరుగా ఉంటుంది. అందులో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ థియేటర్లో విడుదలైతే మరింత సంతోషాన్ని ఇస్తాయి. యాక్షన్ ఫిలింస్ ఒంటరిగా చూసినా ఆస్వాదించగలం కానీ కామెడీ చిత్రాలను థియేటర్లో ఆస్వాదించాలి. నేను ఇలాంటి ఎన్నో సినిమాలు తెరపై చూసి ఆనందించాను.
‘ఎఫ్ 3’లో ప్రేక్షకులు చూడబోయే హైలైట్స్ ఏంటి?
‘ఎఫ్ 2’లోని పాత్రలకు, హ్యూమర్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ సినిమా వాళ్లకు మరింత వినోదాన్ని ఇస్తుంది. కొత్తగా ఏదీ పరిచయం చేయనక్కర్లేదు. గత సినిమా కంటే ఇందులో రెట్టింపు వినోదం చూస్తారు. మేమంతా అదే జోష్‌లో సినిమాకు ప్రచారం చేస్తున్నాం. ప్రీ రిలీజ్లో ఎంత సందడి చేశామో చూశారు కదా.
కామెడీ పండించడం కష్టం అంటారు. మీ అనుభవంలో చెప్పండి
ప్లాన్ చేస్తే కామెడీ రాదు. అప్పటికప్పుడు రావాలి. అందుకే నేను సెట్లో క్రేజీగా ఉంటాను. ఇప్పుడేం చేశాను అనేది కూడా మర్చిపోతుంటాను. దర్శకుడు అనిల్ వచ్చి ఇందాక చేసింది చేయండి సార్ అంటే, మళ్లీ చెక్ చేసుకుని చేస్తాను. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మళ్లీశ్వరి’ లాంటి సినిమాల్లో నటించినప్పుడు కూడా ఇదే అనుభూతికి లోనయ్యాను.
నవ్వులే కాకుండా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏదైనా చెప్పదల్చుకున్నారా?
డబ్బు సంపాదించాలని, జీవితంలో త్వరగా ఎదిగిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఏదీ అడ్డదారిలో దొరకదు. పైకి రావాలంటే శ్రమించాలి. షార్ట్ కట్లో వెళ్తానంటే తిరిగి అక్కడికే వస్తావు. ఇలాంటి మంచి విషయాలను సినిమాలో చూస్తారు.
కామెడీ సినిమాలు చేయడంలో ఈవీవీ తర్వాత అనిల్ రావిపూడి అనుకోవచ్చా?
ఈవీవీలో కామెడీకి ఒక టైమింగ్ ఉంటుంది, అది అనిల్లోనూ కనిపిస్తుంది. శ్రీనువైట్ల తరహా వినోదాన్ని ఎంజాయ్ చేశాను. సినిమాలో మాటలు, పర్ఫార్మెన్స్ సాధారణంగా ఉండాలని అనిల్ అనుకుంటాడు, అలాగే రచన చేస్తాడు. అప్పుడే మా నుంచి సహజమైన నటన వస్తుంది. నాకూ ఈ ైస్టెల్ ఇష్టమే. అతను మా సంస్థలో ‘మసాలా’ మూవీకి రైటర్‌గా పనిచేశాడు. అప్పడే అనిల్‌లో ప్రతిభను గమనించాను.
నేటి సినిమాలో వస్తున్న ట్రెండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి?
ఏ ట్రెండ్ సినిమా అయినా ప్రేక్షకులు ఇచ్చే తీర్పును గౌరవించాలి. ఇటీవల యాక్షన్ సినిమాలు బాగా ఆడాయి. మాది వినోదాత్మక చిత్రం. ఏదైనా ప్రేక్షకుల ముందుకే తీసుకెళ్లాలి. వాళ్లు అదీ చూస్తారు ఇదీ చూస్తారు.
సినిమా ప్రచారంలో తప్ప మళ్లీ బయట కనిపించరు ఎందుకని?
నేను వ్యక్తిగత జీవితాన్ని గడపడానికే ఎక్కువ ఇష్టపడతాను. సమయం దొరికితే కుటుంబంతో ఉంటాను.అందుకే బయట కార్యక్రమాలకు వెళ్లను.
‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు అదెలా ఉండబోతోంది?
నా కెరీర్లో ఇప్పటిదాకా చేయని పాత్ర రానా నాయుడులో చేస్తున్నాను. ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్ అది. నటిస్తున్నప్పుడు నాకు నేనే కొత్తగా అనిపించా. రానాతో కలిసి నటించడం కొత్త అనుభవం.
సల్మాన్ ఖాన్‌తో మీరు కలిసి నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అందులో నేను సల్మాన్ ఖాన్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాను. వచ్చే నెల నుంచి ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటాను.
‘కేజీఎఫ్’ లాంటి భారీ యాక్షన్ సినిమాల్లో నటించాలని అనిపిస్తుంటుందా?
ఎవరేం చేస్తున్నారో చూడటం నాకిష్టం ఉండదు. నేరుగా నా దారిలో వెళ్తుంటాను. నా కెరీర్లో ఎప్పుడూ ఏ హీరోతో పోల్చుకోలేదు. నేను ఎక్కువగా ఏదీ ఆశించను. ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందని భారీ యాక్షన్ మూవీస్ చేయాలని ఆరాటపడను. అలాంటివి వస్తే తప్పకుండా ఆ స్థాయికి కష్టపడి నటిస్తాను. మనం చాలా అనుకుంటాం. కానీ వచ్చిందే తీసుకోవాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

