హృదయాన్ని స్పృశించే సున్నితమైన భావోద్వేగాల్ని తెరపై అందంగా ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఆయన సినిమాల్లో మనసును తట్టిలేపే ఎమోషన్స్ ఉంటాయని ప్రేక్షకులు విశ్వసిస్తారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. నాగచైతన్య కథానాయకుడిగా దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం విక్రమ్ కె కుమార్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
థాంక్యూ అనే పదాన్ని మన రోజువారి వ్యవహారాల్లో చాలా సాధారణంగా వాడేస్తాం. చిన్న చిన్న సందర్భాల్లో కూడా ఉపయోగిస్తుంటాం. దానివల్ల థాంక్యూ అనే పదం విలువ తగ్గించినవాళ్లమవుతున్నాం. నిజానికి ఎక్కడ కృతజ్ఞత చెప్పడం అవసరమో అక్కడ మాత్రం చెప్పకుండా మిన్నకుండి పోతాం. అంతెందుకు మన తల్లిదండ్రులకు థాంక్స్ చెప్పే సందర్భాల్లో మనవాళ్లే కదా అనుకుంటాం. తల్లిదండ్రులు జీవితాంతం మనతోనే ఉండిపోతారనే ఊహల్లో ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. జీవితానికి అనిశ్చితి ఎక్కువ. ఏ మలుపులో ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి ప్రతి సందర్భంలో తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి.
నాగచైతన్యతో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నా. అలాంటి టైమ్‌లో బీవీఎస్ రవి చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఆయన కథలోని ఆత్మ, ఫ్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా ఈ సబ్జెక్ట్‌ను తయారుచేసుకున్నా. అభిరామ్ అనే యువకుడి జీవితంలోని మూడు దశల్ని ఆవిష్కరిస్తూ ఓ నాస్టాల్జిక్ జర్నీలా ఈ కథ సాగుతుంది. 16 నుంచి 34 ఏళ్ల వరకు జరిగే ప్రయాణానికి దృశ్యరూపంలా ఉంటుంది. ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ సినిమాలతో ఈ కథకు ఎలాంటి పోలిక ఉండదు.
ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఏమీ ఉండదు. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేలో అభిరామ్ ప్రయాణాన్ని ఆవిష్కరించాం. నా సినిమాలో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఉండేలా చూసుకుంటా. ఇందులో కూడా అవి కనిపిస్తాయి. నాగచైతన్య ఈ కథ వినగానే ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. ‘నా జీవితంలో కూడా థాంక్స్ చెప్పాల్సిన వారు చాలా మంది ఉన్నారు సర్..’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. మనలో కృతజ్ఞతా భావం లేకుండా ఇలాంటి సబ్జెక్ట్‌ను తెరపై తీసుకురాలేం. ఈ సినిమా చేసే ముందు నా జీవితంలో థాంక్స్ చెప్పాల్సిన మనుషుల గురించి ఆలోచించా.
ఈ సినిమాలో అభిరామ్ పాత్ర కోసం నాగచైతన్య ఎంతో హార్డ్‌వర్క్ చేశారు. ముఖ్యంగా పదహారేళ్ల వయసు అబ్బాయిలా కనిపించడానికి చాలా శ్రమించాడు. బరువు తగ్గడంతో పాటు లుక్స్ పరంగా స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఆయన పాత్ర కోసం డిఫరెంట్ స్కెచెస్ వేసుకొని చూసుకున్నాం. ఇలాంటి క్యారెక్టర్‌ను నాగచైతన్య తప్ప మరెవరూ చేయలేరని అనుకుంటున్నా. నిర్మాత దిల్‌రాజుగారితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ‘థాంక్యూ’ చిత్రంతో నా ప్రయాణానికి ఆయనతో శ్రీకారం చుట్టడం అదృష్టంగా భావిస్తున్నా. దిల్‌రాజుగారి బ్యానర్ ప్రతిష్టను ఇనుమడింపజేసే హృద్యమైన అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దాను.
మనందరికి విధిపై ఎంతో విశ్వాసం ఉంటుంది. తప్పకుండా మంచి జరుగుతుందన్న ఆశావాదంతో జీవిస్తుంటాం. అందుకే నా సినిమాల్లో ఆస్ట్రాలజీ అంశాల్ని స్క్రీన్‌ప్లేలో పెడుతుంటా. కేరళ నుంచి వచ్చాను కాబట్టి ఆస్ట్రాలజీపై నాకు మరింత ఆసక్తి ఉంది. చెన్నైలో ఉండే రోజుల్లో తామరం ప్రాంతంలోని నాడీ జోస్యం నన్ను అమితంగా ఆకట్టుకునేది.
జీవితం తాలూకు రియాలిటీ నాకు బోర్ కొడుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ‘ఈ ప్రపంచం ఎంత అందంగా ఉందో కదా’ అనుకోవాలి. ఈ తాత్విక భూమిక సినిమాల పట్ల నాలో ఆకర్షణ పెంచింది. నా తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయబోతున్నాం. అలాగే హిందీలో ఓ యాక్షన్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నా.