Thaman | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించిన చిత్రాల్లో ‘OG’ ఒకటి. స్టైలిష్ యాక్షన్, పవర్ఫుల్ ప్రెజెంటేషన్, థమన్ సంగీతం, సుజీత్ దర్శకత్వం కలిసి ఈ సినిమాను అభిమానులకు ఒక పండుగలా మార్చాయి. సినిమా విడుదల సమయంలోనే దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హింట్స్ నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ‘OG యూనివర్స్’ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ను వరుసగా విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ యూనివర్స్‌ను మరింత విస్తరించే దిశగా వేగంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ప్రత్యేక వీడియోతో పాటు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల కారణంగా సినిమా పనులు ఆలస్యమవుతాయనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఆయన బిజీ షెడ్యూల్ వల్ల చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని భావించినా, దర్శకుడు సుజీత్ మాత్రం వరుస అప్డేట్స్తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ‘OG యూనివర్స్’ మ్యూజిక్ విడుదల చేసి అభిమానులకు ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదే సమయంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ ముగ్గురూ చేతుల్లో గన్స్ పట్టుకుని స్టైలిష్‌గా పోజులిచ్చారు.
‘OG’ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను అభిమానులు ఊహించిన విధంగా తెరపై చూపించడంలో సుజీత్, తమన్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఈ ముగ్గురిని సోషల్ మీడియాలో ప్రముఖ ‘త్రీ డ్రాగన్స్’ మీమ్‌తో పోలుస్తూ అభిమానులు వైరల్ చేశారు.ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ముగ్గురు కలిసి కనిపించడంతో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. ఈ ఫోటోను పంచుకున్న తమన్, “త్వరలో ఒక సూపర్ వీడియో రాబోతోంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం మరింత చర్చకు దారితీసింది.ఈ వరుస అప్డేట్స్ చూస్తుంటే ‘OG’ యూనివర్స్‌కు సంబంధించిన తదుపరి ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. రోజుకో సర్ప్రైజ్ ఇస్తున్న చిత్రబృందం ఈసారి సినిమాను కూడా వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..