అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్రతో కలిసి ఆయన ఏడడుగులు నడవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే తన పెళ్లి విషయాన్ని సుమంత్ ఇంకా ధృవీకరించలేదు. సుమంత్-పవిత్రలకు సంబంధించినదిగా చెబుతున్న శుభలేఖ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో పెళ్లి తేదీ, వేదిక తాలూకు వివరాలు మాత్రం కనిపించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్ట్‌లో పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారని తెలిసింది. తన పెళ్లి వివరాల్ని సుమంత్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. సుమంత్‌కు ఇది రెండో వివాహం. 2004లో కథానాయిక కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారాయన. మనస్పర్థల కారణంగా ఈ దంపతులు 2006లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు.