Jana Nayagan | దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సోషల్ డ్రామా ‘జన నాయగన్’ విడుదలపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు త్వరలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.య మొదటగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, సెన్సార్‌కు సంబంధించిన కొన్ని అంశాల కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే వాయిదా తర్వాత కూడా సినిమా కొత్త విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదే సమయంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ నెలలో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలపై తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వ్యూహానికి సంబంధించి విజయ్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
తాజా కథనాల ప్రకారం, ఇప్పటికే కుదిరిన థియేట్రికల్ డీల్స్‌ను రద్దు చేసి, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించిన అడ్వాన్స్‌లను తిరిగి ఇవ్వాలని విజయ్ మేకర్స్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్వయంగా చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే సెన్సార్ ప్రక్రియ పూర్తై సర్టిఫికేట్ లభించిన తర్వాత నాన్-థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ఒప్పందాలను కూడా కొత్తగా రూపొందించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్లో అత్యంత కీలక చిత్రాల్లో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్, రిలీజ్ ప్లాన్లకు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.