Suriya Vadivasal Movie | రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటుడు సూర్య. తమిళంలో ఆయన సినిమా రిలీజైతే ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతాయో, తెలుగులో కూడా అదే స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతాయి. ప్రస్తుతం సూర్య వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్నాడు. ఇక సూర్య ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘వడివసాల్’ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్ర నిర్మాత స్పందించాడు.
షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న రూమర్స్‌పై నిర్మాత కలైపులి ఎస్.థాను తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో నిజం లేదని, ఫేమ్ పొందేందుకే కొందరు అలాంటి వదంతులు వ్యాప్తి చేస్తుంటారని పేర్కొన్నాడు. అభిమానులు వాటిని నమ్మవద్దని థాను కోరాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని పేర్కొన్నాడు. యాక్షన్ థిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ సినిమాను వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ఆండ్రియా జెరేమియా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫుటేజ్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఇటీవలే సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అచలుడు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాత సూర్యకు బాలాకు మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో సినిమా ఆగిపోయింది.