Suriya 42 Movie | సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే సంక్రాంతికి రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కమర్షియల్గా సేఫ్ అవుతుంటాయి. ఈ సంక్రాంతికి అది రుజువైంది కూడా. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న వీరసింహా రెడ్డి వంద కోట్ల బొమ్మగా నిలిచింది. ఇక ఎబో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న వాల్తేరు సైతం రెండొందల కోట్ల క్లబ్ లో నిలిచి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకున్న వారసుడు బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టక పోయినా నష్టాలు మాత్రం తీసుకురాలేదు. దాంతో సంక్రాంతి పెద్ద స్టార్లు ఖర్చీఫ్ ఎందుకు వేస్తారో ఈ సంక్రాంతికి రుజువైంది.
కాగా ఇంకా ఎనిమిది నెలలు టైమ్ ఉన్న సంక్రాంతిపై ఇప్పటి నుంచే స్టార్లు ఖర్చీఫ్ వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక రానున్న సంక్రాంతిపై మొదట ఖర్చీఫ్ వేసింది ప్రాజెక్ట్-k సినిమానే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన మరో స్నీక్ పీక్ వీడియోతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇటీవలే మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందంటూ ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇవే కాకుండా భారతీయుడు-2 సినిమా కూడా సంక్రాంతి సీజన్ పైనే కన్నేసినట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఇటీవలే హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఇలా పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతిపై ఖర్చీఫ్ వేయగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికే తన సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా? అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితుడైన సూర్య. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ స్థాయి క్రేజ్ ఉన్న నటుడు సూర్య. ఇక ఇప్పుడు సూర్య కూడా తను చేస్తున్న కొత్త సినిమాను సంక్రాంతికే దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేయగా.. ఇప్పుడు ఐదో సినిమా ముస్తాబవుతుంది. అయితే తెలుగులో ఈ సినిమాకు పోటీ ఉన్నా.. తమిళంలో ఎలాంటి పోటీ లేదు. దాంతో ఈ సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కోట్లు కొల్లగొట్టడం ఖాయం. పైగా తెలుగులోనూ యూవీ క్రియేషన్స్ అండ ఉండటంతో కావల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. ఈ క్రమంలో సంక్రాంతి ఈ సినిమా రిలీజ్ కు సరైన సమయం అని సూర్య భావిస్తున్నాడు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.