Superstar Krishna | సూపర్ స్టార్ కృష్ణను ఇంజినీర్‌ను చేయాలని ఆయన తండ్రి కల. డిగ్రీ తర్వాత ఇంజినీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు కృష్ణ. కొడుకు ఇష్టాన్ని కాదనలేని ఆయన.. తండ్రి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాస్ పంపారు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తన సొంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పారు.
అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు. మద్రాసులోనే ‘చేసిన పాపం కాశీకి వెళ్ళనా?.. నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించారు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలి విజయవాడ.. జింఖానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్ర పోషించారు.
తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వీ ప్రసాద్ తీస్తున్న ‘కొడుకులు కోడళ్లు’ సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేశారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది.
రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశారు. కొంగర జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ (1962) సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ (1964) సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ‘కాదలిక్క నేరమిల్లై’ అనే తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సీవీ శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీంతో ఆయన తెనాలి తిరిగి వచ్చారు.
ఆ తర్వాత 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫొటోలు పంపారు. ఆ తర్వాత మద్రాస్‌కు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా అవకాశం ఇచ్చారు. డైలాగ్స్, డ్యాన్స్ చేయడంపై ఆయన శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.
కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన చిత్రం తేనె మనసులు. కలర్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సాంఘిక చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సాగుతుండగానే.. పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించెయ్యమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది. ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన ‘కన్నెమనసులు’ సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ నటించాడు.
హీరోగా రెండో కన్నెమనుసుల్లో చిత్రంలో నటిస్తున్న సమయంలోనే.. గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం చూసి, డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన జేమ్స్‌బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు. రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు జూలై 22న విడుదలై యావరేజిగా నిలువగా.. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. తొలి తెలుగు జేమ్స్‌బాండ్ నిలువగా.. కృష్ణకు సైతం ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’గా పేరు వచ్చింది.
గూఢచారి సినిమా విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా సంతకం చేశారు. 1967లో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మొనగాళ్లు అన్న జానపద చిత్రం, బాపు-రమణల తొలి చిత్రం, విజయనిర్మలతో నటించిన మొదటి సినిమా సాక్షి. తర్వాతి కాలంలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వీ రామచంద్రరావు. ఈ దశలోనే కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశాడు. ‘వరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది’ కాదని కృష్ణ ఓ సందర్భంలో తెలిపారు. ‘గూఢచారి 116’తో కృష్ణ ఇమేజ్ అమాంతం పెంచేసింది.
ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో మరో ఆరు జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్నీ విజయాన్ని సాధించి పెట్టింది. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం లేకుండా సినిమాలు చేశారు.