‘విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు. నేను చేసిన సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి’ అన్నారు మహేశ్‌బాబు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్, నమ్రతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ‘నేను చాలా సెన్సిటీవ్. సినిమాలు ఆడకపోతే నిరుత్సాహానికి లోనవుతుంటా. అంచనాలు తల్లకిందులైతే కొన్నాళ్లపాటు ఆ ప్రభావం నాపై ఉండిపోతుంది. అందుకే ఆ సమయంలో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతాను. ఈ విషయంలో నాన్న పూర్తిగా డిఫరెంట్. ఆయన జయాపజయాల గురించి ఆలోచించరు. చేసుకుంటూవెళ్లిపోవడమే. ఈ క్రమంలోనే అద్భుతాలు సృష్టించబడ్డాయి’ అంటూ చెప్పుకొచ్చారు మహేశ్.