Peddanna Trailer | రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత రజినీ నుంచి వస్తున్న పక్కా మాస్ సినిమా ఇది. శౌర్యం శివ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న శివ.. తొలిసారి రజనీకాంత్‌తో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా పర్ఫెక్ట్ బ్లాక్‌బస్టర్ ఇవ్వలేకపోతున్న రజినీకాంత్.. ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో బ్రేకుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. తెలుగులో పెద్దన్నగా ఈ సినిమా వస్తుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
పెద్దన్న సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పూర్తి చేశాడు దర్శకుడు శివ. గతంలో అజిత్‌తో వేదాళం సినిమాను కూడా కోల్‌కతాలోనే తెరకెక్కించాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరోసారి రజినీకాంత్ కోసం అదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ పక్కా మాస్‌గా ఉంది. రజినీకాంత్‌ను అంత మాస్‌గా చూసి చాలా ఏళ్లవుతుంది. పేట సినిమాలో మునపటి మాస్ యాంగిల్‌ను ట్రై చేసినా అది వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు శివ తెరకెక్కించిన అన్నాతేలో అది వర్కవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఈమె చుట్టూనే కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ, మీనా, నయనతార వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.
అన్నాతే అంటే అన్నయ్య అని అర్థం. దాన్నే తెలుగులో కాస్త మార్చి పెద్దన్నగా టైటిల్ పెట్టారు. రజినీకాంత్ ఇమేజ్ కు బాగా సరిపోతుంది అనుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమాను తెలుగులో కేవలం 12 కోట్లకు మాత్రమే కొన్నారు. రజినీ గత సినిమాల కంటే ఇది తక్కువే కానీ ఈయన మార్కెట్ ఈ మధ్య బాగా పడిపోయింది. అందుకే తక్కువ రేట్ కే పెద్దన్న అమ్ముడైపోయింది. మరి చూడాలిక.. ఈ సినిమాతో రజినీ ఏం మాయ చేయబోతున్నాడో..?