Sundar C | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ ప్రకటనతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉత్కంఠకు గురైంది. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మొదట దర్శకుడిగా ఎంపికైన సుందర్ సి అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.తాజాగా తన నిర్ణయంపై సుందర్ సి స్పందిస్తూ అసలు కారణాన్ని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్… ఆ స్థాయి ఒత్తిడిని నేను మేనేజ్ చేయలేనని భావించాను అని ఆయన స్పష్టంగా చెప్పారు. స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి తన పరిమితులను ఇంత బహిరంగంగా అంగీకరించడం సినీ వర్గాల్లో అరుదైన విషయం.
గతంలో రజనీకాంత్‌తో కలిసి అరుణాచలం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన సుందర్ సి, ఆయన ఇమేజ్ను అర్థం చేసుకున్న దర్శకుడిగా పేరొందారు. అయినప్పటికీ రజనీ–కమల్ లాంటి దిగ్గజాల కాంబినేషన్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం ఎంతో క్లిష్టమని ఆయన భావించారు. ఇద్దరు స్టార్ల అభిమానులను సంతృప్తి పరచడం, వారి ఇమేజ్ను బ్యాలెన్స్ చేయడం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని తెలిపారు. ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్‌లో ప్రతి అంశం పైన భారీ అంచనాలు ఉంటాయి. చిన్న తప్పిదం జరిగినా సోషల్ మీడియా విమర్శలు తీవ్రంగా ఉంటాయని, అలాంటి ఒత్తిడి తన పనితీరుపై ప్రభావం చూపుతుందని సుందర్ ముందుగానే అంచనా వేసినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ కమర్షియల్ స్టైల్, కమల్ హాసన్ టెక్నికల్ ప్రమాణాలు ఈ రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్ అని ఆయన భావించారు.ఒక పెద్ద అవకాశాన్ని వదులుకోవడం కంటే, దానికి న్యాయం చేయలేనని భావించినప్పుడు గౌరవంగా తప్పుకోవడమే మంచిదని సుందర్ సి నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని పలువురు సినీ విశ్లేషకులు వృత్తిపరమైన నిజాయితీగా అభినందిస్తున్నారు. మొత్తానికి రజనీ–కమల్ ప్రాజెక్ట్ నుంచి సుందర్ సి తప్పుకోవడం అనేది ఒక సాహసోపేత నిర్ణయంగా నిలిచింది. అగ్ర హీరోల సినిమా అంటే కేవలం అవకాశం కాదు, అది భారీ బాధ్యత కూడా అన్న సందేశాన్ని ఆయన తన నిర్ణయంతో స్పష్టంగా తెలియజేశారు.