‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో సినీ దర్శకుడిగా నా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది’ అని అన్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ ‘ఓ యువకుడి జీవితాన్ని ప్రభావితం చేసిన అందాల యువతి కథ ఇది. వారి ప్రేమకు కుటుంబం, సమాజం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఉద్వేగాన్ని పంచుతుంది’ అని తెలిపారు. కథానాయికగా తనకు సరికొత్త అనుభవాన్ని మిగిల్చే సినిమా అవుతుందని, పక్కింటి కథలా ప్రేక్షకులను అలరిస్తుందని అని కృతిశెట్టి చెప్పింది. విభిన్న కథా చిత్రాల దర్శకుడైన ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని నిర్మాత రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెర్రీ, పీజీ విందా తదితరులు పాల్గొన్నారు.