సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ..‘ఇది కొత్త కథ అని చెప్పను గానీ మన చుట్టూ కనిపించే కుర్రాడి కథ. ఊరిలో పనీ పాటా లేకుండా తిరిగే యువకుడు నగరానికి వచ్చి ఇక్కడో సమస్యలో చిక్కుకుంటాడు.
ప్రేమ కథతో పాటు మాస్ కమర్షియల్ అంశాలతో కథనం సాగుతుంది. ఇందులో నా క్యారెక్టర్‌కు తగినట్లు గాలోడు అనే టైటిల్ పెట్టారు. అతని చేష్టలన్నీ అలాగే ఉంటాయి. అతన్ని చూడగానే ఇతనికేం పనిలేదు అనేలా ఉంటాడు. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ప్రయత్నంతో ఈ సినిమాలో నటించాను. నేను ఈ కథలకు సరిపోతానా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. నా వంతు ప్రయత్నమైతే చేశాను. ఇకపైనా సినిమాలతో పాటు టీవీ కార్యక్రమాల్లోనూ పనిచేస్తాను’ అన్నారు.