Srikanth | టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో ‘డ్రామా జూనియర్స్ సీజన్ 9’ లో జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 9’కు మల్టీ టాలెంటెడ్ స్టార్ సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌తో పాటు నటి రోజా, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిలుగా ఉన్నారు.
తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. ఇందులో శ్రీకాంత్, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన సంభాషణ మొదట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రోమోలో శ్రీకాంత్ స్టేజ్‌పైకి రాగానే సుధీర్ తనదైన స్టైల్లో చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. “ఏంటన్నా.. మీరు ఎప్పుడూ చిన్నపిల్లల నవ్వుతో కనిపిస్తారు” అంటూ శ్రీకాంత్‌ను సరదాగా పలకరించాడు. అయితే సుధీర్ మాటలకు శ్రీకాంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. వెంటనే అతడిని అడ్డుకుంటూ, “హేయ్.. ఆపు! నీకు నేను హీరోలా కనిపించడం లేదా? తగ్గూ.. కొంచెం తగ్గూ.. అతి చేయకు. నీ హద్దుల్లో నువ్వు ఉండు” అంటూ గట్టిగా హెచ్చరించారు. అంతేకాకుండా, ఇన్నాళ్లూ మొహమాటంతో ఊరుకున్నానని, బయట తనకంటూ ఒక గౌరవం ఉందని శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ఇలాంటి ప్రవర్తన కొనసాగితే తనకు ఈ షోనే వద్దంటూ కూడా చెప్పడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
శ్రీకాంత్ ఒక్కసారిగా సీరియస్ కావడంతో సుడిగాలి సుధీర్ కూడా ఆశ్చర్యపోయాడు. పరిస్థితిని కాస్త సరదాగా మార్చే ప్రయత్నంలో “అన్నా.. ఇదంతా ప్రోమో కోసమే చేస్తున్నారా?” అంటూ ప్రశ్నించాడు. దీనికి శ్రీకాంత్ మరింత సీరియస్‌గా స్పందిస్తూ.. “ప్రతిదాన్నీ కమర్షియల్‌గా ఎందుకు చూస్తావ్?” అంటూ సుధీర్‌పై మండిపడ్డారు. దీంతో నిజంగానే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే వీడియో చివర్లో అసలు ట్విస్ట్ బయటపడింది. ఇంతసేపు కోపంగా కనిపించిన శ్రీకాంత్ ఒక్కసారిగా నవ్వుతూ.. “ఇది అసలైన ప్రోమో అంటే!” అని చెప్పడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో శ్రీకాంత్ – సుధీర్ మధ్య జరిగిన గొడవ అంతా నిజం కాదని, షో ప్రమోషన్ కోసం ప్లాన్ చేసిన ఓ ప్రాంక్ మాత్రమేనని స్పష్టమైంది. ప్రోమోలో ఎడిటింగ్, శ్రీకాంత్ నటన, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎంతో సహజంగా ఉండటంతో చాలామంది ఈ గొడవ నిజమేనని నమ్మేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.