Sreemukhi | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన చురుకైన మాటలతో, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకవైపు వరుస టీవీ షోలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కడ కనిపించినా ఆమె పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 33 ఏళ్ల వయసులో ఉన్న శ్రీముఖి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర పోషించారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రీముఖి, తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పై మాట్లాడిన శ్రీముఖి సరదాగా మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత పెళ్లి అయింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అంతేకాకుండా, ఇప్పటికీ సరైన పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నాను. దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి గురించి నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలకు అక్కడున్న ప్రేక్షకులు, సినీ ప్రముఖులు చప్పట్లతో స్పందించారు.శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమెకు త్వరలో మంచి జీవిత భాగస్వామి దొరకాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఇప్పుడైనా గుడ్ న్యూస్ చెప్పేయండి , శ్రీముఖి పెళ్లి కోసం మేమూ వెయిట్ చేస్తున్నాం అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే, శ్రీముఖి ప్రస్తుతం టెలివిజన్ రంగంలో అత్యంత బిజీ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. పలు రియాలిటీ షోలు, స్పెషల్ ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ‘మా ఇంటి బంగారం’లో ఆమె పోషించిన పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.