సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా? ఉండదా? ఈ అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివి. వాటిని గౌరవించాల్సిందే. కానీ, నిజమంటూ ఒకటుంటుంది కదా.. దాని గురించి మాట్లాడుకుందాం. కళలు ప్రేరకాలు. కళాకారుల కళారూపాలన్నీ జనాన్ని ప్రభావితంచేయడానికే. స్వాతంత్య్రోద్యమంలో గానీ మన తెలంగాణ ఉద్యమంలోగానీ ప్రజల్ని ప్రేరేపితం చేయడంలో ప్రజాకళాకారుల పాత్రను, ప్రభావాన్నీతక్కువ చేసి చూడలేం. ఒక పాట, ఒక కవిత, ఒక కథ, ఒక దృశ్యం.. వీటికి మనసుల్ని కదిలించే, కరిగించే శక్తి ఉంటుందనేది శిలాక్షర సత్యం. ఇక సినిమా విషయానికొస్తే.. సినిమా అనేది సకలకళల సమ్మేళనం. అలాంటప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయదని ఎలా చెప్పగలం?
ఎన్టీయార్, ఎమ్జీయార్ లాంటి సూపర్స్టార్లు.. తమ సినిమాల ద్వారా జనానికి ఏదో ఒక మంచి చెప్పడానికి తాపత్రయపడేవారు. మరీ ముఖ్యంగా ఎమ్జీయార్ అయితే సిగరెట్ తాగే సీన్లలో నటించేవారు కాదు. తాను తాగితే, ప్రభావితమై ప్రజలు కూడా తాగేస్తారని భయం ఆయనకు. సినిమా జీవితాల్ని ప్రభావితం చేస్తుందని వారు నమ్మారు.
‘దేవదాసు’కు ముందు విఫల ప్రేమికుడు బొమ్మలు గీసుకుంటూనో, కవితలు రాసుకుంటూనో, పాటలు పాడుకుంటూనో కనిపించే వాడు. దేవదాసు వచ్చాడూ పద్ధతి మార్చేశాడు. ‘మరుపునకు అసలైన మందు మధువే’నని జగత్తుకు చాటాడు. అప్పట్నుంచి మద్యం అమ్మకాలు ఏస్థాయిలో పెరిగాయో అప్పటి గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ‘దేవదాసు’ కళాఖండమే. కాదని ఎవరూ అనరు. అయితే శరత్చంద్ర.. పాపం నవల మాత్రమే రాశారు. కానీ మన వేదాంతం రాఘవయ్య ఏకంగా ‘దేవదాసు’ని తెరకెక్కించేశాడు. తెరకెక్కిన ‘దేవదాసు’ ఊరుకున్నాడా!.. బ్రాందీ షాపుల సైన్ బోర్డులపైకి కూడా ఎక్కేశాడు. ఆ గ్లాస్ పట్టుకునే తీరు చూసి మురిసిపోయిన ట్యాక్స్ పేయర్లు.. అదేనండీ మందుబాబులు అప్పట్లో కోకొల్లలంట.
ఇక వాణిశ్రీ చీరలు.. వాణిశ్రీ జాకెట్లు.. వాణిశ్రీ బొట్టుబిళ్లలు.. వాణిశ్రీ హెయిర్ ైస్టెల్.. వాణిశ్రీ హెయిర్ పిన్స్.. అబ్బో ఇలా చెప్పుకొంటూ పోతే.. పెద్దలిస్టే అవుతుంది. ఆ రోజుల్లో ఆడాళ్లంతా వాణిశ్రీలేనట. చివరకు షోరూమ్స్ బయట షర్మిలా ఠాకూర్ బొమ్మలు పెడితే, వాటిని కూడా వాణిశ్రీ బొమ్మలే అనుకునేవారంట జనం.
ముఖానికి రంగులేసుకునే ఓ నటుడు బయటకొచ్చి రాజకీయపార్టీ పెట్టి ఓటు అడిగితే అతణ్ని ఏకంగా ముఖ్యమంత్రినే చేసేశారు జనం. ఆ ప్రభావంతోనే తర్వాతకాలంలో కొందరు నటులు రాజకీయపార్టీలు పెట్టారు. ఇది ప్రభావితం చేసిన అంశం కాదంటామా?..
‘మాయాబజార్’లో కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీయార్ స్టిల్‌ని క్యాలండర్‌గా వేయించి విడుదల చేశారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. అవి ముందు గోడలెక్కాయి. తర్వాత ఏకంగా పూజా మందిరాల్లో తిష్ఠేసుకుని కూర్చున్నాయి. ఎంత ప్రభావితం కాకపోతే అలా జరిగుంటుంది చెప్పండి?
పాత సినిమాలు, ముఖ్యంగా 60ల్లో సినిమాలు బాగా చూసిన వారికి ఓ విషయం అర్థమై ఉండాలి. అవుట్ డోర్ సన్నివేశాల్లో వెనక ఉన్న జనాలను గమనిస్తే.. చిత్రంగా ఒక్కొక్కరూ ఒక్కో అక్కినేనిలా కనిపిస్తుంటారు. అదే డ్రెస్‌కోడ్, అదే నడక.. అలాగే నిలబడటం. అంతెందుకు? ఎప్పుడైనా ఏఎన్నార్ విమానం దిగుతున్న సన్నివేశం చూడండి.. ఆయనతో ఫ్లైట్ దిగేవాళ్లంతా అక్కినేని ైస్టెల్లోనే కనిపిస్తారు. అప్పట్లో యువతను ఆయన అంతలా ప్రభావితం చేశారన్నమాట.
‘ఎదురులేని మనిషి’ సినిమా విడుదలైంది. ఆ సినిమా కోసం ఎన్టీయార్ ైస్టెల్ మార్చారు. బాబీ కాలర్, బెల్‌బాటమ్ ప్యాంట్ ధరించారు. నిజానికి అంతకు ముందే బాలీవుడ్లో ఆ ైస్టెల్ మొదలైనా.. మనవాళ్లకు తెలిసింది మాత్రం ‘ఎదురులేని మనిషి’ నుంచే. ఆ రోజుల్లో ఎన్టీయార్ ైస్టెల్ ఫాలో అవ్వని కుర్రాడు లేడు. ఈ ైస్టెల్లో ఎన్టీయార్‌కి బట్టలు కుట్టిన కంపెనీ పేరు ‘యాక్స్ టైలర్’. ఆ తర్వాత తెలుగునేలపై ప్రతి ఊళ్లో ఒక ‘యాక్స్ టైలర్’ వెలిసింది. ‘యాక్స్ టైలర్’ అంటే అదో బ్రాండ్. ఆ పేరున్న టైలరింగ్ షాపులో బట్టలు కుట్టించుకోవడం ఓ క్రేజ్. ఆ పేరుతో చాలామంది టైలర్లు బతికేశారు.
‘ప్రేమాభిషేకం’ సినిమా ముందు ‘క్యాన్సర్ వ్యాధి’ అంటే చాలామందికి తెలీదు. ఆ సినిమా వచ్చి చాలామందికి క్యాన్సర్‌పై అవగాహన పెంచింది. దీన్నిబట్టి సినిమాకు అవగాహన పెంచే శక్తి ఉందని నమ్మొచ్చు.
తెలుగునేలపై ‘రికార్డింగ్ డ్యాన్స్’ అనే సంప్రదాయం మొదలవ్వడానికి ప్రభావితం చేసిన అంశాలేంటి? ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలామంది కళాకారులకు ఇదే భుక్తి. వాటి పుణ్యమా అని కొన్ని కుటుంబాలు బతికేశాయి. బతుకుతున్నాయి కూడా. ఇది కూడా ప్రభావితం చేసిన అంశమేగా.
చిరంజీవి.. అప్పటి యువతరానికి ఆయనే రోల్ మాడల్. చిరంజీవి ప్రేరణగా, హీరో అవుదామని చెన్నయ్ రైళ్లెక్కినవారి సంఖ్య చాంతాడంత. సక్సెస్ అయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. చిరంజీవిలా ఫైటింగులు చేయాలని ప్రయత్నించి మోకాళ్లు విరగ్గొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. చిరంజీవి ప్రభావం వల్ల గొప్ప డ్యాన్సర్లయిన స్టార్లూ ఉన్నారు.
‘శివ’.. సినిమా విడులైంది. అంతకుముందు తలకు నూనె పెట్టుకుని చక్కగా దువ్వుకునే కుర్రాళ్లు.. తలకు నూనె మానేసి పైకి దువ్వడం మొదలుపెట్టారు. హ్యండ్కఫ్స్ పెట్టుకొని బుద్ధిగా స్కూల్‌కెళ్లిన పిల్లలు.. చొక్కా చేతుల్ని మణికట్టు వరకూ మడవడం మొదలుపెట్టారు. సైకిల్ చైన్‌ని మరోలా ఉపయోగించొచ్చని కూడా ‘శివ’ సినిమానే అప్పటి కుర్రాళ్లకు నేర్పింది. ‘ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా.. వాయిదా పద్ధతుంది దేనికైనా..’ అని సిరివెన్నెల పొరపాటున రాసిన నాలుగు లైన్ల వల్ల.. మార్చి పరీక్షలు తప్పి సెప్టెంబర్ రాసినవాళ్లు కోకొల్లలు. ‘శివ’ పాత్ర ద్వారా రౌడీయిజం ‘తప్పు’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్తే.. దాన్నెవరూ ఫాలో అవ్వలేదు. పైగా భవానీని ఆదర్శంగా తీసుకున్నారు. ఫలితంగా వీధికొక రౌడీ పుట్టుకొచ్చాడు. సెంటర్‌కో గ్రూపు తయారైంది. అప్పట్లో రఘువరన్ ధరించిన స్పన్ షర్ట్స్ బాగా అమ్ముడుపోయేవి. సమాజంపై ‘శివ’ ప్రభావం అసామాన్యమైనది.
‘గీతాంజలి’ పుణ్యమా అని ప్రేమికులు పెరిగారు. చిత్రం, నువ్వేకావాలి, 7/జీ బృందావన్ కాలని సినిమాల వల్ల టీనేజ్ ప్రేమలు పెరిగాయి. నేటి యువతపై ‘అర్జున్‌రెడ్డి’ ప్రభావాన్ని తక్కువ చేసి చూడగలమా? అర్జున్‌రెడ్డి ప్రవర్తన.. ఆ ధిక్కార స్వభావం.. అర్జున్‌రెడ్డి హెయిర్‌ైస్టెల్.. అర్జున్‌రెడ్డి గడ్డం.. చివరకు అర్జున్‌రెడ్డి పాత్రలోని చెడులక్షణాలు సైతం యువతరాన్ని కట్టిపడేశాయి. దాంతో గల్లీకొక అర్జున్‌రెడ్డి తయారయ్యాడు.
అంచేత.. చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. మంచి చేదుగా ఉంటుంది. చెడు తీయగా ఉంటుంది. అందుకే చెడు వేగంగా జనాల్లోకెళ్తుంది. కళాత్మకరంగంలో ఉండేవాళ్లు ఈ విషయంపై బాధ్యతగా ఉండాలి. మంచైన చేదుని రుచిగా అందించడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప తేలిగ్గా అమ్ముడుపోతున్నదని చెడు రుచిని జనాలకు మరిగిస్తే.. సమాజం మురిగిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త!
…? బుర్రా నరసింహా