Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుతోంది. టి-సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా, ఇప్పుడు ఊహించని లీగల్ వివాదంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్’ టైటిల్‌కు సంబంధించిన ఈ వివాదం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)’ పేరుతో ఇప్పటికే ఒక చిన్న సినిమా నిర్మించిన నిర్మాతలు, ప్రభాస్ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వివాదం వెనుక ఒక సాధారణ రైతు కుటుంబం ఉందని ‘స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)’ నిర్మాత నరసమ్మ చెబుతున్నారు. గొర్రెలు, మేకలు, ఇతర ఆస్తులను విక్రయించి ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించామని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాజాగా నరసమ్మ కుమారుడు, ఆ సినిమా హీరో రవి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ‘స్పిరిట్’ బృందంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సినిమాను విడుదల చేయొద్దని ఒత్తిడి తెస్తున్నారని, క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రవి తెలిపిన వివరాల ప్రకారం, తాము 2024 ఫిబ్రవరిలోనే ‘స్పిరిట్’ టైటిల్‌ను అధికారికంగా చాంబర్లో నమోదు చేయించుకున్నామని చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా బృందం మాత్రం 2024 ఏప్రిల్‌లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుందని పేర్కొన్నారు.
చట్టపరంగా టైటిల్ హక్కులు మాకే ఉన్నాయి. అయినప్పటికీ టి-సిరీస్ సంస్థ మా ఇంటి అడ్రస్ తీసుకుని లీగల్ నోటీసులు పంపించింది. మేము కూడా లాయర్ ద్వారా రిప్లై నోటీసు పంపించాం అని రవి వెల్లడించారు. తాము చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని రవి స్పష్టం చేశారు. తమ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని, అందువల్ల చట్టపరంగా తమకే బలమైన హక్కులు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేము కోర్టుకు వెళ్తే ప్రభాస్ సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో బ్యాక్‌డోర్ సెటిల్మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రవి మరో సంచలన ఆరోపణ చేశారు. టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో మా కంటే వారికి పెద్ద ఇమేజ్ ఉంది. డబ్బులు ఇచ్చి ఈ వివాదాన్ని ముగించాలని ప్రయత్నించే అవకాశం ఉందనే అనుమానం ఉంది అని రవి పేర్కొన్నారు.అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు టి-సిరీస్, సందీప్ రెడ్డి వంగా లేదా ‘స్పిరిట్’ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.