Singer Sunitha | ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమా సామాజిక బాధ్యత, మరియు సమాజంలో స్వేచ్ఛ అనే అంశాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. సమాజంలో జరిగే విషయాలనే సినిమాలో చూపిస్తున్నామని మేకర్స్ చెప్పే సమాధానాన్ని సునీత తప్పుబట్టారు. కమర్షియల్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సమాజంలో సినిమాని తిడితే, సినిమాలో సమాజాన్ని తిడుతున్నారు, సమాజం అలా ఉంది కాబట్టే తాము ఇలా సినిమా తీశామని మేకర్స్ చెబుతున్నారని సునీత పేర్కొన్నారు.
ఇక ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న మై బాడీ మై రైట్ అనే స్లోగన్పై సునీత ప్రాక్టికల్ కోణంలో మాట్లాడారు. అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం అని తమకు నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి చూసే చూపును కూడా వాడి కళ్ళు వాడి ఇష్టం అనాల్సి వస్తుందని, ఇందులో ఎవరినీ తప్పు పట్టలేమని అన్నారు. ఎవరి ఇష్టం వారిదని ఆమె స్పష్టం చేశారు. అయితే బట్టల పరిధిని పెంచుకోవడాన్ని లేదా తగ్గించుకోవడాన్ని తన దృష్టిలో అసలైన స్వేచ్ఛ అనరని సునీత తెలిపారు. చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయో చూసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. కేవలం బట్టలు లేదా సిగరెట్లు తాగడం ఈక్వాలిటీ కాదని, సమాజంలో లేదా ఒక ఇంట్లో ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్తే, దానికి పురుషులు ఎంతవరకు విలువ ఇస్తున్నారు అనే దానిపై పోరాడాలని సునీత అభిప్రాయపడ్డారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై కూడా సునీత పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరి ఒపీనియన్ వాళ్లది. ఎస్ చెప్పాలన్నా, నో చెప్పాలన్నా మన ఇష్టమే. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, నేను జనరల్ గా సొసైటీలో ఉన్న అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక గీత గీయాలంటే, ఫుల్ స్టాప్ పెట్టాలంటే బలవంతం ఏమీ లేదు అని సునీత తెలిపారు.