Simran | ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన సీనియర్ నటి సిమ్రాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దాదాపు పదేళ్లకు పైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటీనటుల పట్ల ఉండే వ్యవహార శైలిపై ఘాటుగా స్పందించారు. తన అందం, నటన, మంచి డ్యాన్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సిమ్రాన్, ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటీనటులను సరైన గౌరవంతో చూడరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణాదిలో మాకు ఎంతటి పేరు, గుర్తింపు ఉన్నా బాలీవుడ్లో వాటిని పట్టించుకోరు. మేము కొత్తగా వచ్చిన వారిలా ప్రవర్తిస్తారు. అక్కడ ఒక విధమైన చులకన భావం కనిపిస్తుంది అంటూ సిమ్రాన్ స్పష్టం చేశారు. తాను హిందీ సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని ఆమె చెప్పారు. ముఖ్యంగా వసతుల విషయంలో బాలీవుడ్ నిర్మాతలు బేరసారాలు చేయడం తనకు అస్సలు నచ్చేదికాదని అన్నారు. హోటల్ గదులు, విమాన ప్రయాణాలు, సిబ్బంది ఖర్చులు వంటి అంశాల్లో కూడా రాజీ పడమని ఒత్తిడి తీసుకువచ్చేవారని పేర్కొన్నారు.
ఇవి చిన్న విషయాలుగా అనిపించొచ్చు. కానీ ఒక నటిగా మనకు ఇచ్చే గౌరవాన్ని అవి ప్రతిబింబిస్తాయి. వృత్తిపరమైన మర్యాద చాలా ముఖ్యం అని సిమ్రాన్ అన్నారు. సరిగ్గా మాట్లాడకపోవడం, దక్షిణాది నటీనటుల పట్ల చూపే వైఖరి తనను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. సినిమాలను ఎంతో ప్రేమించే తనలాంటి వారిని తక్కువ చేసి చూడటం వల్లే బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ చాలా వరకు తిరస్కరించానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దక్షిణాది అభిమానులు ఆమెకు మద్దతుగా స్పందిస్తుండగా, బాలీవుడ్ వర్గాల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.సిమ్రాన్ దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పటికీ తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు.