Siddharth | సినీ నటుడు సిద్ధార్థ్, నటి అదితిరావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలకు, రెస్టారెంట్లకు ఇద్దరూ కలిసి వెళ్లిన ఫొటోలు సైతం ఇటీవల నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా నటుడు సిద్ధార్థ్ చేసిన పోస్టుతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.
అదితి శుక్రవారం తన 36వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో నటుడు సిద్ధార్థ్ సైతం అదితికి స్పెషల్ విషెస్ చెప్పారు. అదితితో దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సిద్ధార్థ్.. ‘‘హృదయ రాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిన్న, పెద్ద తేడా లేకుండా నువ్వు కన్న ప్రతి కలా నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని పోస్టు చేశారు.
ఇది చూసిన అభిమానులు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఇక వీరిద్దరూ 2021లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘మహాసముద్రం’లో మొదటిసారిగా కలిసి నటించారు.