Virat Karrna | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవాలనే బలమైన సంకల్పంతో దూసుకుపోతున్న యువ నటుడు విరాట్ కర్ణ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. నటనపై ఉన్న అపారమైన మక్కువతో, పాత్రల పరిధి కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని ఈ యువ హీరో, ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నాగబంధం’ అనే భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రేక్షకులను సరికొత్త పౌరాణిక, కాస్మిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా అత్యున్నత సాంకేతిక విలువల తో తెరకెక్కుతున్న ఈ సినిమా విశేషాలు, అలాగే నటుడిగా విరాట్ కర్ణ పడిన శ్రమ, ఎదుర్కొన్న ప్రాణాంతక సవాళ్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తన కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి అద్భుతమైన భారీ ప్రాజెక్టులు దక్కడంపై విరాట్ కర్ణ స్పందిస్తూ, ఇదంతా కేవలం భగవంతుడి దయ, తన అదృష్టం అని చెప్పుకోచ్చాడు. తన మొదటి సినిమా ‘పెద్దకాపు’ కూడా భారీ బడ్జెట్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, ఈ స్థాయిలో ‘నాగబంధం’ లాంటి శతాధిక కోట్ల ప్రాజెక్ట్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదని, అయితే బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఒక నటుడిగా తన వంద శాతం శ్రమను ఎప్పుడూ ఇస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మొదటి సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కొంతకాలం తీవ్ర నిరాశకు, డిప్రెషన్‌కు లోనైనప్పటికీ, ఫలితం మన చేతుల్లో లేదని, కేవలం కష్టపడటమే మన వంతు అనే జీవిత సత్యాన్ని గ్రహించి మరింత పట్టుదలగా ముందుకు సాగుతున్నట్లు విరాట్ పేర్కొన్నారు. ఇకపై కెరీర్లో లాంగ్ గ్యాప్స్ రాకుండా చూసుకుంటూ, ప్రతి ఏటా కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
దర్శకుడు అభిషేక్ నామా తన మొదటి సినిమా చూసి, ఈ కథకు సరిపోయే ఎత్తు, శారీరక దారుఢ్యం, నటన సామర్థ్యం తనలో ఉన్నాయని నమ్మి పిలిపించారని విరాట్ గుర్తుచేసుకున్నారు. కథ విన్నప్పుడే అందులోని ‘రుద్ర’, ‘నాగసాధు’ అనే రెండు విభిన్న పాత్రల స్వభావం తనకు గూస్బంప్స్ తెప్పించిందని, ఈ కథ తన కోసమే పుట్టిందనే బలమైన భావన కలిగి మరుసటి రోజు నుంచే జిమ్, హార్స్ రైడింగ్, డ్యాన్స్, యాక్టింగ్ వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో రుద్ర పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత శివుడి పాత్ర కోసం మరో 5 కిలోలు పెరిగి, మళ్లీ బరువు తగ్గే సుదీర్ఘమైన శారీరక పరిణామాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. కేవలం శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ పాత్ర కోసం ఎంతో సన్నద్ధమయ్యానని, షూటింగ్‌కు ముందు లభించిన మూడు నెలల విరామంలో రోజూ తెల్లవారుజామున మూడు గంటలకే లేచి శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయడం, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం ద్వారా తనలో ఒక తెలియని సానుకూల ఎనర్జీ ఏర్పడిందని, అది నాగసాధు పాత్రను రక్తికట్టించడానికి ఎంతో ఉపయోగపడిందని ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ అనంతరం కూడా ఎంతో పవిత్రంగా శివమాల ధరించి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు.
సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన సవాళ్లు, ప్రమాదాల గురించి విరాట్ కర్ణ వివరిస్తూ.. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కండరాలు చిరిగిపోయి (Muscle Tear) తీవ్రమైన నొప్పి ఎదురైనా భరించానని, వైద్యులు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నా సినిమా కోసం కష్టపడ్డానని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ చలికాలంలో, డిసెంబర్ రాత్రి వేళల్లో బేర్ బాడీతో (షర్ట్ లేకుండా), ఒంటికి రంగులు పూసుకుని 200 అడుగుల ఎత్తులో రోప్స్ సహాయంతో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక భయంకరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. కింద ఉన్న థాయ్‌లాండ్ ఫైట్ మాస్టర్ కిచ్చాకు తెలుగు రాకపోవడం వల్ల, కిందకు దించమంటే పైకి లేపడంతో చలి తీవ్రతకు శరీరం గడ్డకట్టుకుపోయి, మెదడు మొద్దుబారిపోయిందని, వెంటనే దర్శకుడు అపోలో ఆసుపత్రికి తరలించగా పరీక్షల్లో డెంగ్యూ లక్షణాలు బయటపడ్డాయని తెలిపారు. అయినప్పటికీ కేవలం ఒక్క రోజు మాత్రమే విరామం తీసుకుని మరుసటి రోజే మళ్లీ సెట్స్‌కు హాజరైనట్లు తన అంకితభావాన్ని చాటుకున్నారు.
కొత్త హీరో అయినప్పటికీ వందల కోట్లు పెట్టి భారీ సెట్స్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య షూటింగ్ చేస్తున్నప్పుడు మొదట్లో కొంత భయం వేసినా, దర్శకుడు అభిషేక్ నామా ఆ ఒత్తిడి తనపై పడకుండా చూసుకున్నారని కొనియాడారు. అభిషేక్ నామాకు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసని, థియేటర్లలో చప్పట్లు, ఈలలు వేయించేలా అద్భుతమైన ఎలివేషన్స్ డిజైన్ చేశారని, ఆయన తనను ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దారని ప్రశంసించారు. శివుడి పాత్రకు తనకు చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారే స్ఫూర్తి అని, ‘శ్రీ మంజునాథ’ చిత్రంలో ఆయన నటన చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అలాగే ప్రముఖ యాక్టింగ్ కోచ్ భాగ్యశ్రీ వద్ద కూడా శిక్షణ పొందినట్లు వివరించారు. ఈ చిత్రంలో హీరోయిన్ నభా నటేష్‌తో కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని, రుద్ర-పార్వతి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని, సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు అద్భుతమైన రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు.
భారీ అంచనాలున్న ‘నాగబంధం’ చిత్రాన్ని బాలీవుడ్ (హిందీ) తో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విరాట్ స్పష్టం చేశారు. ఇతర భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, ఈ సినిమాను 3D వర్షన్లో కూడా తీసుకురాబోతున్నామని, థియేటర్లలో విడుదలైన రెండవ వారంలో 3D వెర్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి వస్తున్న బుకింగ్స్, క్రేజ్ చూస్తుంటే ఆ శివుడి ఆశీస్సులు తమపై ఉన్నాయనిపిస్తోందని సంతోషపడ్డారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ.. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాలు ఉన్న సినిమాలంటే తనకు ఇష్టమని, ఇప్పటికే ఇద్దరు కొత్త దర్శకులతో ఒక యాక్షన్ సూపర్ హీరో సబ్జెక్ట్‌తో సహా రెండు సినిమాలు లైన్లో ఉన్నాయని, ‘నాగబంధం’ విడుదలయ్యాక వాటిని అధికారికంగా ప్రకటిస్తానని, అలాగే ఈ చిత్రానికి పార్ట్-2 కూడా ఉంటుందని విరాట్ కర్ణ ముగించారు.