Shakti kapoor | బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ మరణవార్త గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ప్రముఖ నటుడు శక్తి కపూర్ మరణించారంటూ కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అభిమానులు, సినీ వర్గాలు షాక్కు గురయ్యాయి.సినీ ప్రముఖులపై ఇలాంటి తప్పుడు మరణ వార్తలు రావడం కొత్త విషయం కాకపోయినా, ఈసారి శక్తి కపూర్ విషయంలో ప్రచారం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి మరణించారనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులకు కూడా వరుస ఫోన్ కాల్స్, సందేశాలు రావడంతో వారు తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శక్తి కపూర్ స్వయంగా స్పందించి పుకార్లకు చెక్ పెట్టారు. సామాజిక మాధ్యమం వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన, తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. వైలెట్ రంగు దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా కనిపించిన శక్తి కపూర్, “నా మరణం గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మకండి” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయితే కేవలం వివరణ ఇచ్చి ఆగిపోకుండా, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు. ఇది సరైన పద్ధతి కాదు. నా గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసిన వారిపై సైబర్ నేర విభాగానికి ఫిర్యాదు చేస్తాను అని 73 ఏళ్ల నటుడు స్పష్టం చేశారు.
శక్తి కపూర్ స్పందన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి , టైగర్ ఇంకా బలంగానే ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.శక్తి కపూర్ బాలీవుడ్లో నాలుగు దశాబ్దాలకుపైగా నటుడిగా కొనసాగుతున్నారు. విలన్ పాత్రలతో పాటు హాస్య పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన దాదాపు 700 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘రాజా బాబు’, ‘అందాజ్ అప్నా అప్నా’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉన్నాయి. విలన్గా భయపెట్టడమే కాకుండా కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం కూడా శక్తి కపూర్ ప్రత్యేకత. ప్రస్తుతం ఆయన కూతురు శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. గత ఏడాది విడుదలైన స్త్రీ2 చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.